
ఐపీఎల్ 2026కు యశ్ దయాల్ దూరం!
గతేడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ యశ్ దయాల్ ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరం కానున్నాడు. లైంగిక వేధింపుల ఆరోపణలు, న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో.. ఈ సీజన్‌లో అతడు జట్టుతో చేరడం లేదని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బొబాట్ మంగళవారం స్పష్టం చేశారు. 28 ఏళ్ల యశ్ దయాల్ గత ఐపీఎల్ ఫైనల్ తర్వాత మళ్లీ మైదానంలోకి దిగలేదు. ప్రస్తుతం అతడు ఎదుర్కొంటున్న వ్యక్తిగత పరిస్థితుల దృష్ట్యా, అతడు జట్టుకు దూరంగా ఉండటమే అటు ఆటగాడికి, ఇటు ఫ్రాంచైజీకి మంచిదని యాజమాన్యం భావించింది.
మద్దతుగా నిలిచిన ఫ్రాంచైజీ
యశ్ దయాల్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆర్సీబీ యాజమాన్యం అతడికి అండగా నిలిచింది. "యశ్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. అతడికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అందుకే అతడిని వేలంలోకి వదలకుండా జట్టులోనే అంటిపెట్టుకున్నాం. ప్రస్తుతానికి అతడు మాతో ఆడకపోయినా, ఒప్పందం ప్రకారం జట్టు సభ్యుడిగానే కొనసాగుతాడు" అని బొబాట్ స్పష్టం చేశారు. యశ్ దయాల్‌తో తాము నిరంతరం టచ్‌లో ఉన్నామని, అతడి పరిస్థితిని గమనిస్తున్నామని ఆయన తెలిపారు. 2024 సీజన్‌లో ఆర్సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడైన యశ్ లేకపోవడం జట్టుకు కచ్చితంగా లోటేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రత్యామ్నాయం ఎవరు?
యశ్ దయాల్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆర్సీబీ వద్ద సమర్థవంతమైన దేశవాళీ బౌలర్లు ఉన్నారని బొబాట్ ధీమా వ్యక్తం చేశారు. రసిక్ సలామ్, అభినందన్ సింగ్, మంగేష్ యాదవ్‌లలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మంగేష్ యాదవ్ ప్రదర్శనపై యాజమాన్యం ఆశలు పెట్టుకుంది. వీరితో పాటు స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా గాయం నుంచి కోలుకుని త్వరలోనే జట్టుతో చేరుతారని ఆర్సీబీ ఆశిస్తోంది. యశ్ దయాల్ గైర్హాజరీలో ఈ యువ బౌలర్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.
తొక్కిసలాట బాధితులకు ఆర్సీబీ నివాళి
గతేడాది బెంగళూరులో జరిగిన ఐపీఎల్ వేడుకల తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది అభిమానులకు నివాళిగా ఆర్సీబీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 28న సన్‌రైజర్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు ముందు వార్మప్ సెషన్‌లో ఆటగాళ్లందరూ '11'వ నంబర్ జెర్సీలను ధరించి వారికి నివాళులర్పించనున్నారు. అసలు మ్యాచ్‌లో నల్లటి రిబ్బన్లతో బరిలోకి దిగుతారు. వీరి జ్ఞాపకార్థం స్టేడియంలో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచి, స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే కేవలం నివాళులకే పరిమితం కాకుండా భద్రతా ప్రమాణాలను పెంచాలని బాధితుల కుటుంబాలు కోరుతున్నాయి.
