Let's talk: editor@tmv.in
ఐపీఎల్ సీజన్ వేళ‌ బెట్టింగ్ ఊబిలో పడొద్దు: వీసీ సజ్జనార్

ఐపీఎల్ సీజన్ వేళ‌ బెట్టింగ్ ఊబిలో పడొద్దు: వీసీ సజ్జనార్

Gaddamidi Naveen
29 మార్చి, 2026

ఐపీఎల్ క్రికెట్ సంబరాలు మొదలవుతున్న తరుణంలో, క్రికెట్‌ను కేవలం ఒక క్రీడగా మాత్రమే ఆస్వాదించాలని, బెట్టింగ్ వంటి వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ యువతకు, క్రీడాభిమానులకు విజ్ఞప్తి చేశారు.

గతంలో ప్రభుత్వం బెట్టింగ్‌యాప్స్‌కు నో చెప్పండి ప్రచారం చేపట్టి వందలాది బెట్టింగ్ యాప్‌లను నిషేధించినప్పటికీ, ప్రస్తుతం ఈ అక్రమ కార్యకలాపాలు కొత్త రూపంలో కొనసాగుతున్నాయని ఆయ‌న తెలిపారు. ముఖ్యంగా టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా బెట్టింగ్ నెట్‌వర్క్‌లు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం ఆర్థిక లాభాల కోసం ఇటువంటి యాప్‌లను ప్రచారం చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయ‌న‌ హెచ్చరించారు. యువతను తప్పుదారి పట్టించే ఈ విధమైన ప్రచారాన్ని పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని తెలిపారు.

ఆన్‌లైన్ బెట్టింగ్‌తో పాటు, ఫామ్‌హౌస్‌లు, ఇతర రహస్య ప్రదేశాల్లో జరుగుతున్న ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై కూడా ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. ఈ దందాను పూర్తిగా అణిచివేయడానికి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. బెట్టింగ్ వల్ల అప్పులపాలై, కుటుంబాలు వీధిన పడే పరిస్థితిని తెచ్చుకోవద్దని సజ్జనార్ కోరారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో మోసపోవద్దని హితవు పలికారు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా 94906 16555 వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

ఐపీఎల్ సీజన్ వేళ‌ బెట్టింగ్ ఊబిలో పడొద్దు: వీసీ సజ్జనార్ - Tholi Paluku