
ఐపీఎల్ రూల్స్ బ్రేక్.. అభిషేక్ శర్మకు భారీ జరిమానా
ఐపీఎల్ నిబంధనల ఉల్లంఘన కారణంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.3 ప్రకారం 'లెవల్ 1' నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. దీనికి శిక్షగా అభిషేక్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం అధికారిక ప్రకటనలో తెలిపింది. తన తప్పును అంగీకరించిన అభిషేక్, మ్యాచ్ రిఫరీ విధించిన జరిమానాను అంగీకరించాడు. జరిమానాతో పాటు అతడి ఖాతాలో ఒక డెమెరిట్ పాయింట్ కూడా చేరింది.
బ్యాటింగ్‌లో విజృంభణ.. సిక్సర్ల సెంచరీ
జరిమానా పక్కన పెడితే, ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు. కేవలం 21 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ తరఫున ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 101 సిక్సర్లు ఉండగా, 143 సిక్సర్లతో డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆరెంజ్ ఆర్మీ తరఫున 76 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్.. 162.88 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 1,808 పరుగులు సాధించాడు.
సన్‌రైజర్స్ ఖాతాలో తొలి విజయం
హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్.. జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ మలింగ, నితీష్ కుమార్ రెడ్డిల సమర్థవంతమైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. క్లాసెన్ (52), నితీష్ రెడ్డి (39) రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాను సన్‌రైజర్స్ బౌలర్లు కట్టడి చేశారు. కేకేఆర్ ఓపెనర్లు ఫిన్ అలెన్ (28), అంగ్క్రిష్ రఘువంశీ (52) మెరుపులు మెరిపించినా, మిగిలిన వారు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో 161 పరుగులకే కోల్‌కతా కుప్పకూలింది. ఫలితంగా 65 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఘనవిజయం సాధించింది.
