
ఐపీఎల్ ఇంపాక్ట్ ప్లేయర్ నియమం: భారత ఆల్‌రౌండర్ల బౌలింగ్ పురోగతికి అడ్డంకి!
మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్, ఐపీఎల్‌లోని ఇంపాక్ట్ ప్లేయర్ నియమమే భారత ఆల్‌రౌండర్ల బౌలింగ్ నైపుణ్యాల అభివృద్ధికి ప్రధాన అవరోధమని అభిప్రాయపడ్డాడు.
‘ఆస్ట్రేలియా వైట్‌బాల్ పర్యటనలో గాయంతో దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా లేకుండా 15 మంది సభ్యుల భారత జట్టు బరిలోకి దిగింది. శివమ్ దూబె, నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్లుగా చేర్చారు కానీ, నితీష్ క్వాడ్రిసెప్స్ గాయంతో మొదటి మూడు టీ20లకు అందుబాటులో లేకపోయాడు. హార్దిక్ లేని లోటు భారత్‌కు బాగా తెలిసింది. వన్డే సిరీస్‌లో 1-2తో ఓటమి పాలైంది. భారత జట్టును సమతుల్యంగా మార్చే అత్యంత విలువైన ఆటగాడు హార్దిక్’ అని వాట్సన్ అన్నాడు.
‘హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ సామర్థ్యంతో భారత్‌కు అమూల్యం. అతడు ఉంటే జట్టు పూర్తిగా సమతుల్యమై, బలోపేతమవుతుంది’ అని బుధవారం మీడియాతో వాట్సన్ చెప్పాడు. హార్దిక్ స్థానంలో మూడో టీ20లో దూబెకు బౌలింగ్ అవకాశం దక్కింది కానీ మూడు ఓవర్లలో 43 పరుగులిచ్చి 1 వికెట్ మాత్రమే తీసి దెబ్బతిన్నాడు. మూడు వన్డేల్లో ఆడిన నితీష్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 5.1 ఓవర్లు వేసి 40 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ నియమం వల్లే భారత ఆల్‌రౌండర్లు బౌలింగ్‌లో ఇబ్బందులు పడుతున్నారని వాట్సన్ భావిస్తున్నాడు. ఈ నియమం ప్రకారం ప్లేయింగ్ ఎలెవెన్‌లోని ఆటగాడిని సబ్‌స్టిట్యూట్‌తో మార్చుకోవచ్చు. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ ఆప్షన్లు పరిస్థితి ఆధారంగా పెంచుకోవచ్చు.
వాట్సన్ ప్రకారం, ఈ నియమం ప్రవేశపెట్టిన తర్వాత ఆల్‌రౌండర్ల పాత్ర, ముఖ్యంగా బౌలింగ్‌లో గణనీయంగా తగ్గింది. ఒత్తిడి పరిస్థితుల్లో బౌలింగ్ అవకాశాలు తక్కువ కావడంతో టీ20 ఫార్మాట్‌లో నైపుణ్యాలు అభివృద్ధి చెందడానికి ఎక్కువ సమయం పడుతోంది.
‘ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నియమం వల్ల నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబెలాంటి వాళ్లు దాదాపు బౌల్ంగ్ చేయలేదు. టీ20ల్లో బౌలింగ్ నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి ఐపీఎల్ అవకాశం లభించలేదు. ఈ నియమం వచ్చిన తర్వాత బ్యాటర్ బయటకు వెళ్తే ఫ్రంట్‌లైన్ బౌలర్ లోపలికి వస్తాడు. దీంతో ఆల్‌రౌండర్ల అభివృద్ధి వెనకబడుతోంది’ అని వాట్సన్ వివరించాడు.
