
ఐదేళ్ళ బాలుడిపై వీధి కుక్క దాడి
ఇటీవల కాలంలో వీధి కుక్కల బెడద తీవ్రరూపం దాల్చింది. పట్టణాల్లో, గ్రామాల్లో ఎక్కడ చూసినా కుక్కల దాడుల వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా ఏమీ తెలియని చిన్నపిల్లలే ఈ దాడులకు ప్రధాన లక్ష్యంగా మారుతుండటం అందరినీ కలచివేస్తోంది. తాజాగా సూరారంలో జరిగిన ఈ ఘటనే దీనికి నిదర్శనం
సూరారం మసీదు వీధిలో ఆరు బయట ఆడుకుంటున్న ఐదేళ్ళ బాలుడిపై ఓవీధికుక్క దాడి చేసి మొఖం పై గాయపర్చింది. పక్కనే ఉన్న స్థానికులు అరవడంతో కుక్క బాలుడిని వదిలి వెళ్లిపోయింది. గాయపడిన బాలుడిని చికిత్స కోసం స్థానిక హస్పిటల్ కు తరలించారు.గత కొద్ది రోజులుగా వీధి కుక్కలు కాలనీలో స్వైరవీహరం చేస్తూ, భయాందోళనలు సృష్టిస్తున్నాయి.. ఈ ఘటనపై గాజుల రామారం సర్కిల్ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇలాంటి దాడులని భరించలేక కొందరు కుక్కలపై చర్యలు తీసుకుంటుంటే ఆ చర్య నేరమని కేసులు వేస్తున్నారని జనం వాపోతున్నారు. ఇలాంటి ఘటనే వరంగల్ లో జరిగింది.
కుక్కలను అమానుషంగా తరలించినందుకు ఎన్ఐటి వరంగల్ చీఫ్ వార్డెన్‌పై కేసు నమోదు
క్యాంపస్‌లోని వీధి కుక్కలను అమానుష రీతిలో తరలించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చీఫ్ వార్డెన్‌తో పాటు ముగ్గురు కుక్కల పట్టుకునే వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాంపస్‌లో చాలా కాలంగా కుక్కల బెడద ఉందని జనవరి 17న చీఫ్ వార్డెన్ కంప్లైంట్ ఇవ్వగా, కుక్కలను పట్టుకునే బృందం ఇనుప తీగలను ఉపయోగించి కుక్కలను ఈడ్చుకుంటూ వాహనాల్లోకి ఎక్కించారు.
'స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా' క్రూయల్టీ ప్రివెన్షన్ మేనేజర్ ఎ. గౌతమ్ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కుక్కలను తరలించే క్రమంలో వాటికి తీవ్రమైన శారీరక నొప్పిని కలిగించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
జంతు సంక్షేమ కార్యకర్తలు సకాలంలో స్పందించడంతో ఈ అక్రమ తరలింపు ప్రక్రియ ఆగిపోయింది. అయినప్పటికీ, అప్పటికే ఆ మూగజీవాలు తీవ్ర హింసకు గురయ్యాయని ఫిర్యాదుదారు తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హన్మకొండ జిల్లాలోని కాజీపేట పోలీస్ స్టేషన్‌లో జనవరి 19న భారతీయ న్యాయ సంహిత, జంతు హింస నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నారు.
ఇటీవల జరిగిన మరో ఘటనలో, హైదరాబాద్ శివార్లలో రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామం లో కుక్కలవల్ల ఇబ్బందులు పడుతూ 100 కుక్కలకు విషమిచ్చి చంపారనే కారణంతో, గ్రామ సర్పంచ్‌తో సహా గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే, దీనిపై స్పందించిన తెలంగాణా పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి సీతక్క ఒక ప్రకటన విడుదలచేశారు.
కుక్కల పట్ల క్రూరత్వంపై కఠిన చర్యలు: మంత్రి సీతక్క హెచ్చరిక
మంత్రి సీతక్క విడుదల చేసిన ప్రకటనలో, కుక్కల పట్ల జరిగిన అమానుష ఘటనలపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారని, విచారణ కొనసాగుతోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
జంతువుల పట్ల ఇలాంటి అమానుష, చట్టవిరుద్ధమైన చర్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. జనాభా నియంత్రణ పేరుతో వీధి కుక్కలను చంపడాన్ని ఏమాత్రం సమర్థించలేమని ఆమె పేర్కొన్నారు. జంతువులకు విషం పెట్టడం లేదా వాటికి హాని కలిగించడం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య పెరుగుతుందన్న ఫిర్యాదులు ఉన్నప్పటికీ, స్థానిక సంస్థలు కేవలం చట్టబద్ధమైన, శాస్త్రీయమైన, మానవీయ పద్ధతుల్లోనే ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. మూకుమ్మడిగా జంతువులను చంపడం ఆమోదయోగ్యం కాదని, అది నిబంధనల ఉల్లంఘనే అని ఆమె స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం.. కేవలం వ్యాక్సినేషన్ (టీకాలు వేయడం) స్టెరిలైజేషన్ (సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు) వంటి శాస్త్రీయ పద్ధతులను మాత్రమే పాటించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్ని గ్రామ పంచాయతీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు.
మరోపక్క వీధి కుక్కల హత్యలు అమానుషం, ప్రభుత్వ వైఫల్యాలే కుక్కకాట్లకు కారణం, మూగజీవాలపై క్రూరత్వానికి తక్షణమే ముగింపు పలకాలి అంటూ రేణుదేశాయి లాంటి సెలబ్రెటీలు మీడియా ముందుకు వచ్చి ప్రసంగాలు చేస్తున్నారు.
ఏదిఏమైనా కుక్కలవల్ల సమస్యలు రోజురోజుకూ ఎక్కువయ్యి అమాయక పిల్లలు బలి అవతున్నారు. ప్రభుత్వం కాని, ప్రజలు కాని ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై మాత్రం చర్చించక పోవడం కొసమెరుపు.
