
ఐదేళ్ల తర్వాత మయన్మార్ పార్లమెంట్ సమావేశం
సుమారు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మయన్మార్ దేశంలో పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే, ఈ పార్లమెంట్ పౌర పాలనకు సంకేతం కాదని, సైనిక పాలనను చట్టబద్ధం చేసుకునే ప్రక్రియేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2021లో ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం, అప్పటి నుంచి దేశాన్ని తన గుప్పిట్లో ఉంచుకుంది. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షాలను దూరం పెట్టి, సైనిక మద్దతు ఉన్న పార్టీలే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో కొత్త పార్లమెంట్ కొలువుదీరింది.
90 శాతం స్థానాలు సైన్యం, మిత్రపక్షాలకే
మయన్మార్ పార్లమెంట్‌లోని ఉభయ సభల్లోనూ సైన్యానికి ఎదురులేకుండా పోయింది. రాజ్యాంగం ప్రకారం కేటాయించిన రిజర్వుడ్ స్థానాలతో పాటు, సైనిక మద్దతు ఉన్న 'యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ' (యూఎస్‌డీపీ) అత్యధిక స్థానాలను గెలుచుకుంది. రెండు సభల్లోని మొత్తం 586 స్థానాల్లో దాదాపు 90 శాతం సీట్లు సైన్యం, దాని అనుబంధ పార్టీలకే దక్కాయి. గతంలో అధికారంలో ఉన్న సూకీకి చెందిన 'నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ)’తో పాటు ఇతర ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించడమో లేదా పోటీ చేసే అవకాశం లేకపోవడమో జరిగింది. 373 స్థానాలున్న దిగువ సభ సోమవారం భేటీ కాగా, బుధవారం ఎగువ సభ సమావేశం కానుంది.
అధ్యక్ష పీఠంపై మిన్ ఆంగ్ లైంగ్?
ప్రస్తుత సైనిక ప్రభుత్వ అధినేత సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ లైంగ్ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మయన్మార్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఏకకాలంలో సైనిక దళాల సర్వసైన్యాధ్యక్షుడిగా కొనసాగకూడదు. దీంతో అత్యంత శక్తిమంతమైన ఆర్మీ చీఫ్ పదవిని ఆయన వదులుకుంటారా? లేదా రాజ్యాంగాన్ని సవరిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు 80 ఏళ్ల వయసులో ఆంగ్ సాన్ సూకీ ఇప్పటికీ జైలులోనే మగ్గుతున్నారు. ఆమెపై మోపిన అభియోగాలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని అంతర్జాతీయ సమాజం విమర్శిస్తోంది.
అంతర్జాతీయ విమర్శలు
మయన్మార్ సైన్యం నిర్వహించిన ఈ ఎన్నికలను అంతర్జాతీయ సంస్థలు తప్పుబడుతున్నాయి. ఐరాస మానవ హక్కుల విభాగం ప్రతినిధి టామ్ ఆండ్రూస్ స్పందిస్తూ.. ఈ ఎన్నికల ఫలితాలను అంతర్జాతీయ సమాజం తిరస్కరించాలని కోరారు. ఇదిలా ఉండగా, 2021లో పదవులు కోల్పోయిన ప్రజాస్వామ్యవాదులతో కూడిన 'షాడో పార్లమెంట్' కూడా సోమవారం ఆన్‌లైన్ ద్వారా సమావేశమైంది. తమదే నిజమైన చట్టబద్ధమైన పార్లమెంట్ అని వారు స్పష్టం చేశారు. భారీ భద్రత, పేలుడు పదార్థాల తనిఖీల నడుమ కొత్త పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనా, దేశంలో నెలకొన్న అంతర్యుద్ధం, అశాంతి ఎప్పుడు సముసిపోతాయోనని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
