Let's talk: editor@tmv.in
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Panthagani Anusha
18 మార్చి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ ), సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి (ఏపీఈడీబీ ) నూతన కార్యాలయాన్ని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏపీఈడీబీ అత్యంత కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. ఈ బృహత్తర లక్ష్య సాధనలో అధికారులందరూ సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎంఎస్ఎంఈల బలోపేతమే మార్గం

కాగా రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు అపారమైన అవకాశాలు ఉన్నాయని క్షేత్రస్థాయిలో ఎంఎస్ఎంఈల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల సహకారం తీసుకుని ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత పటిష్టం చేస్తామన్నారు. అదేవిదంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఐదేళ్లలో లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా అంతకు మించిన విజయాలను నమోదు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు టి.కృష్ణబాబు, యువరాజ్, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.