Let's talk: editor@tmv.in
ఐదేళ్ల‌లో వంద‌ల కోట్ల దోపిడీ

ఐదేళ్ల‌లో వంద‌ల కోట్ల దోపిడీ

FL - BRTH
2 అక్టోబర్, 2025

పేద‌ల‌కు ఇళ్లు నిర్మిస్తామ‌ని వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కోట్ల రూపాయాల అవినీతి చేశార‌ని రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్ర‌భుత్వంపై తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి విమ‌ర్శ‌లు సిగ్గుచేటని అన్నారు. రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం రామగిరి మండ‌ల దుబ్బార్ల‌ప‌ల్లిలో ఎన్టీఆర్ భ‌రోసా సామాజిక భ‌ద్ర‌తా ఫించ‌న్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత మాట్లాడుతూ రాక్రీట్ సంస్థ పేరుతో గ‌త ప్ర‌భుత్వంలో వంద‌ల కోట్ల అవినీతి జ‌రిగింద‌న్నారు. దీనిపై ఇప్ప‌టికే అధికారులు ప్ర‌భుత్వానికి నివేదిక‌లు ఇచ్చార‌ని, త్వ‌ర‌లో చ‌ర్య‌లు తీసుకుంటార‌ని తెలిపారు.

ఐదేళ్ల పాటు తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి పేద‌ల సొమ్ము స్వాహా చేసి.. ఇప్పుడు త‌గుదున‌మ్మా అంటూ వ‌చ్చి ఇళ్లు క‌డ‌తాన‌ని చెబుతున్నార‌ని విమ‌ర్శించారు. నెల‌కోసారి నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చి వైసీపీ కార్య‌క‌ర్త‌ల్ని రెచ్చ‌గొడుతున్నార‌ని ఆరోపించారు. డిజిట‌ల్ బుక్కుల‌కు, బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేవారు లేర‌ని రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత అన్నారు. ఇలాంటి నాయ‌కుల్ని న‌మ్మితే సామాన్యులు కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందిప‌డ‌తార‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప‌రిటాల సునీత హిత‌వు ప‌లికారు.

తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వంలో పార‌ద‌ర్శ‌కంగా ఫించ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌న్నారు. అర్హ‌త ఉండి కూడా ఫించ‌న్లు అంద‌ని వారికి త్వ‌ర‌లో అందేలా చేస్తామ‌ని హామీ ఇచ్చారు. గ‌తంలో జ‌గ‌న్ రేష‌న్ కార్డుల‌పై త‌న బొమ్మ వేసుకుంటే.. ఇప్పుడు తాము మ‌హిళ‌ల పేరుతో స్మార్ట్ రేష‌న్ కార్డు అందించ‌బోతున్నామ‌ని చెప్పారు. సూప‌ర్ సిక్స్ హామీలన్నీ తూచ‌త‌ప్ప‌కుండా నెర‌వేరుస్తామ‌ని అన్నారు. త‌ల్లికి వంద‌నం, ఆర్టీసీ ఉచిత ప్ర‌యాణం ప‌థ‌కంతో మ‌హిళ‌లు సంతోషంగా ఉన్నార‌ని రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత అన్నారు.

ఐదేళ్ల‌లో వంద‌ల కోట్ల దోపిడీ - Tholi Paluku