
ఐదు రాష్ట్రాలకు జల్‌జీవన్ మిషన్ 2.0 నిధులు విడుదల
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ మంగళవారం జల్ జీవన్ మిషన్ (జేజేఎం2.0) కింద ఐదు రాష్ట్రాలకు మొత్తం రూ.1,561.53 కోట్ల నిధులను విడుదల చేసింది. ఆర్థిక సంవత్సరం 2025–26కి సంబంధించిన ఈ నిధులు, సంస్కరణలతో అనుసంధానించిన ఒప్పందాలు (ఎంవోయూలు) చేసుకున్న రాష్ట్రాలకు, అవసరమైన ప్రమాణాలు పూర్తి చేసిన తర్వాత విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది.
రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపు
ఉత్తరప్రదేశ్– రూ.792.93 కోట్లు, చత్తీస్‌గఢ్ – రూ.536.53 కోట్లు, మధ్యప్రదేశ్– రూ.154.02 కోట్లు, ఒడిశా– రూ.65.31 కోట్లు, మహారాష్ట్రకు – రూ.12.74 కోట్లు కేటాయించింది.
జేజేఎం 02.0 కింద రాష్ట్రాలు మెరుగైన సేవలు, నీటి స్థిరత్వం , గ్రామస్థాయి నిర్వహణ వంటి కీలక సంస్కరణలకు అంగీకరించిన తర్వాతే ఈ నిధులు విడుదలయ్యాయి. పారదర్శకత కోసం కొత్త వాలిడేషన్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. ఇందులో ఆర్థిక, సాంకేతిక, డేటా ప్రమాణాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పూర్తి చేయాలి. పనితీరు ఆధారిత విధానం తొలిసారి అమలు చేయనున్నారు. ఇప్పటివరకు 12 రాష్ట్రాలు జాతీయ జల జీవన్ మిషన్‌తో సంస్కరణల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
జేజేఎం2.0 లక్ష్యాలు
మార్చి 10న కేంద్ర మంత్రివర్గం జేజేఎం2.0కి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా మౌలిక సదుపాయాల నిర్మాణం మాత్రమే కాకుండా, నిరంతరంగా నాణ్యమైన పైపుల ద్వారా తాగునీటి సరఫరా అందించడంపై దృష్టి పెట్టింది. ఈ పథకానికి మొత్తం వ్యయం రూ.8.69 లక్షల కోట్లు కాగా, కేంద్రం వాటా రూ.3.59 లక్షల కోట్లు ఇవ్వనుంది. 2019లో పథకం ప్రారంభ సమయంలో దేశంలోని గ్రామీణ కుటుంబాల్లో కేవలం 16.7% (3.23 కోట్లు) మాత్రమే ట్యాప్ కనెక్షన్లు ఉండేవి. ప్రస్తుతం 12.59 కోట్లకు పైగా కొత్త కనెక్షన్లు ఇచ్చి మొత్తం 15.83 కోట్ల (81.8%) కుటుంబాలకు నీటి సౌకర్యం కల్పించారు. జేజేఎం2.0 కింద 2028 డిసెంబర్ నాటికి దేశంలోని అన్ని 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాలకు పైపుద్వారా తాగునీరు అందించడం, ప్రతి గ్రామపంచాయతీని ‘హర్ ఘర్ జల్’గా ప్రకటించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ లక్ష్య సాధనలో రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కీలకమని కేంద్రం స్పష్టం చేసింది.
