Let's talk: editor@tmv.in
ఐదు మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను తిరస్కరించిన స్పీకర్

ఐదు మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను తిరస్కరించిన స్పీకర్

Gaddamidi Naveen
18 డిసెంబర్, 2025

అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో ఐదుగురిపై దాఖలైన అనర్హత పిటిషన్లను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం కొట్టివేశారు. ఈ నిర్ణయంపై బీఆర్‌ఎస్ తీవ్రంగా స్పందించింది.

బుధవారం స్పీకర్ ఉత్తర్వుల ప్రకటనకు వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్‌రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టీ. ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ పై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారాలు చూపలేకపోయారని తీర్పులో పేర్కొన్నారు. సాంకేతికంగా ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోనే ఉన్నట్టు స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలో స్పీకర్ గతంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమ వివరణలు సమర్పించారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంకా సమాధానం ఇవ్వలేదు. వారు మరికొంత గడువు కోరుతూ స్పీకర్‌ను ఆశ్రయించారు.

బీఆర్‌ఎస్ తీవ్ర ఆగ్రహం - ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే

స్పీకర్ నిర్ణయంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయాన్ని ప్రజాస్వామ్యంలో ఒక "క్రూరమైన పరిహాసం"గా ఆయన అభివర్ణించారు. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీ వేదికపై ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు ఉండవని చెప్పినట్లుగానే స్పీకర్ కూడా వ్యవహరిస్తున్నారు. ఇది అధికార పార్టీ ఆదేశాలకు లోబడి తీసుకున్న నిర్ణయం. మేము న్యాయపోరాటానికి వెళ్తాం. న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని కేటీఆర్ అన్నారు.

ఇదిలా ఉండగా, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను నిర్ణీత కాలంలో తేల్చాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని పేర్కొంటూ, నవంబర్ 17న తెలంగాణ స్పీకర్‌కు అత్యున్నత న్యాయస్థానం ధిక్కార నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల తర్వాత విచారణకు తీసుకోనుంది.