Let's talk: editor@tmv.in
ఐటీ రిటర్న్స్ దాఖలు ఆలస్యానికి కారణం?

ఐటీ రిటర్న్స్ దాఖలు ఆలస్యానికి కారణం?

FL - BRTH
17 సెప్టెంబర్, 2025

ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు ముగిసింది. చాలా మంది ఇంకా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదు. గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. జులై 31న తుది గడువు పెట్టారు. ఆ తర్వాత పొడిగించాలని డిమాండ్ వినిపించడంతో ఆ గడువును సెప్టెంబర్ 15కు పెంచారు. అయినప్పటికీ చాలా మంది ఐటీ రిటర్స్న్ దాఖలు చేయలేదు. మళ్లీ కూడా గడువు పెంచాలనే డిమాండ్ వినిపించింది. కానీ ప్రభుత్వం నుంచి మరోవాదన వినిపిస్తోంది. ఇలాగే పెంచుతూపోతే ఒక అనిశ్చితి ఏర్పడుతుందని, ప్రతిసారి ఇలా గడువు పెంచలేమన్నది ప్రభుత్వ వాదన. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు జులై, ఆగస్టుల్లోనే చేసుకోవచ్చు కదా అన్న ప్రశ్న ప్రభుత్వం నుంచి వినిపిస్తోంది.

ఐటీ రిటర్స్న్ దాఖలు చేస్తున్నవారి వాదన మరోలా ఉంది. చాలా మంది మొదటిసారి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు, కొన్నిరకాల స్పష్టత తీసుకోవాల్సిన వారు ఐటీ రిటర్న్స్ తుది గడువులోపు దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా కంపెనీలు ఉద్యోగులకు ఫామ్ సి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు. టీడీఎస్ సర్టిఫికెట్స్ తొందరగా రావు. పై కారణాలతో ఐటీ రిటర్న్స్ దాఖలు ఆలస్యం అవుతుందని వాదిస్తున్నారు. మరోవైపు కొంత మంది నిర్లక్ష్యం కూడా రిటర్న్స్ దాఖలు చేయడానికి కారణం అవుతోందని నిపుణలు భావిస్తున్నారు. తుది గడువు వరకు దాఖలు చేయకుండా, చివరి దశలో హడావుడిగా అందరూ ఒకేసారి దాఖలు చేయడానికి ప్రయత్నించడం సర్వర్ బిజీ కావడానికి, పేమెంట్ చేయడంలో విఫలమవ్వడానికి కారణం అవుతోందని విశ్లేషిస్తున్నారు.

అదే సమయంలో సాంకేతిక వైఫల్యం కూడా ఆలస్యం కావడానికి కారణం అవుతోందని నిపుణులు భావిస్తున్నారు. ఐటీ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ.. టెక్నాలజీ విషయంలో అలసత్వం ఉందని అంటున్నారు. అందుకే సర్వర్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయని చెబుతున్నారు. వీటి నుంచి బయటపడాలంటే టెక్నాలజీ విషయంలో చాలా ముందుచూపుతో వ్యవహరించాలని నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికీ సర్వర్ పనిచేయకపోవడం వంటి సమస్యలు ప్రజల్ని ఇబ్బందిపెట్టడం సహేతుక అంశం కాదని చెబుతున్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారి సంఖ్య పెరుగుతున్న సమయంలో.. అదేస్థాయిలో టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా రిటర్న్స్ దాఖలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

ఐటీ రిటర్న్స్ దాఖలు ఆలస్యానికి కారణం? - Tholi Paluku