Let's talk: editor@tmv.in
ఐటీ యజమానులతో సమావేశం అవ్వండి: డీజీపీకి బండి సంజయ్ విన్నపం

ఐటీ యజమానులతో సమావేశం అవ్వండి: డీజీపీకి బండి సంజయ్ విన్నపం

Gaddamidi Naveen
14 ఏప్రిల్, 2026

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న ఒక ఐటీ సంస్థ (ఎంఎన్ సీ)లో వెలుగుచూసిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన, తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డికి కీలక సూచనలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

నాసిక్ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండకూడదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకముందే జాగ్రత్త పడాలని బండి సంజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారని, కార్యాలయాలు వారి కెరీర్‌కు భరోసా ఇచ్చేలా ఉండాలి తప్ప.. వేధింపులకు, మతపరమైన ఒత్తిళ్లకు వేదికలు కాకూడదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ డీజీపీ తక్షణమే ప్రముఖ ఐటీ కంపెనీల యాజమాన్యులతో, ముఖ్యంగా హెచ్ఆర్ విభాగాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యాలయాల్లో కఠినమైన జవాబుదారీతనం ఉండాలని, ఏ ఒక్క ఫిర్యాదును కూడా దాచిపెట్టకూడదు ఆయన సూచించారు. బాధితులను ఒంటరిగా విడిచిపెట్టకుండా రక్షించడం, యాజమాన్యం బాధ్యతాయుతంగా వ్యవహరించడం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

కంపెనీ యాజమాన్యాలు, హెచ్‌ఆర్ బృందాలు ఉద్యోగుల గౌరవం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునే వాతావరణాన్ని కల్పించాలని ఐటీ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురు ఉద్యోగులు తమ కార్యాలయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను పంచుకుంటున్నారని, ఆ హెచ్చరిక సంకేతాలను విస్మరించవద్దని అధికారులను కోరారు.

నాసిక్ ఘటన నేపథ్యం

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగుతోంది. అక్కడి మంత్రి గిరీష్ మహాజన్ ఏప్రిల్ 10న ఈ విషయాన్ని వెల్లడించారు. ఎనిమిది మంది ఉద్యోగుల ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసు నమోదు కాగా, సీనియర్ సహచరులు మానసికంగా, లైంగికంగా వేధించారని, హెచ్‌ఆర్ విభాగం తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని వారు ఆరోపించారు.

ఈ కేసులో ఇప్పటివరకు కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్‌తో సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో సదరు ఐటీ సంస్థ స్పందిస్తూ.. వేధింపుల విషయంలో తాము 'జీరో టాలరెన్స్' విధానాన్ని అనుసరిస్తామని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేశామని ప్రకటించింది. ప్రభుత్వ పరంగా ఇలాంటి అంశాలను నిశితంగా గమనిస్తూనే ఉంటామని, ఉద్యోగుల భద్రత, గౌరవానికి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు.