
ఐటీ పార్కులపై పిల్…యువత ఉపాధికి ముప్పు: నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మక ఐటీ పార్క్ ప్రాజెక్టులపై వరుసగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)లు దాఖలవడం పట్ల రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా న్యాయపరమైన అడ్డంకులు యువతకు లభించాల్సిన ఉపాధి అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసిఎస్), కాగ్నిజెంట్, సత్త్వ గ్రూప్, రహేజా కార్పొరేషన్ వంటి గ్లోబల్ సంస్థలు ఏర్పాటు చేయనున్న ఐటీ పార్క్‌లపై పిఐఎల్ లు దాఖలయ్యాయని లోకేష్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో లక్షకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు యువతకు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
అయితే ఈ అంశంపై ఎక్స్ (ఎక్స్) వేదికగా స్పందించిన లోకేష్, ఈ ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)లు దాఖలవడం వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని ఆరోపించారు. టీసీఎస్, కాగ్నిజెంట్, సత్త్వ, ఇప్పుడు రహేజా ఐటీ పార్క్‌లపై వరుసగా పిఐఎల్ లు దాఖలవుతున్నాయి. యువత భవిష్యత్తు పై ఇంత ద్వేషం ఎందుకు? ప్రతి అడుగులోనూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడం ఎందుకు? అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు.
అయితే ఈ ఆరోపణలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా లేదా సామాజిక సంస్థలు దాఖలు చేసిన కేసులను పార్టీకి ఆపాదించడం తగదని పార్టీ లీగల్ సెల్‌కు చెందిన మెంబెర్ మనోహర్ రెడ్డి స్పష్టంచేశారు.
ప్రతిష్ఠాత్మక పెట్టుబడి ప్రాజెక్టులపై పదేపదే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పి ఐ ఎల్)లు దాఖలవడం వల్ల పెట్టుబడిదారుల్లో నెగటివ్ భావన ఏర్పడుతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. దీని కారణంగా సాంకేతికత, ఆవిష్కరణలు, నాణ్యమైన ఉద్యోగాల రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్లాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, చట్టబద్ధంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా విధానాలను అమలు చేస్తోందని లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఉపాధి కల్పించి ఆర్థిక వృద్ధిని తీసుకువచ్చే ప్రాజెక్టులను అన్ని విధాలా కాపాడతామని ఆయన తెలిపారు.
రాష్ట్ర భవిష్యత్తు యువతకు ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి మరియు ఆర్థిక వృద్ధిపైనే ఆధారపడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ తరహా అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు ఏర్పడితే, యువత ఆశలు నిరాశగా మారే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయిన పరిస్థితుల్లో ఆ లోటును పూడ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఆర్థిక కేంద్రాలను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీ 4.0 (2024–2029)’ను అమలు చేస్తోంది. ఈ విధానం కింద అర్హత సాధించిన ఐటీ సంస్థలకు రాష్ట్రవ్యాప్తంగా ఎకరా భూమిని కేవలం రూ.0.99 (99 పైసలు)కే కేటాయిస్తోంది. ఈ పాలసీ ప్రయోజనాలు పొందుతున్న సంస్థల్లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కూడా ఒకటిగా ఉంది అనే లోకేష్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, విశాఖపట్నంలో రహేజా కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్న ఐటీ పార్క్‌కు సంబంధించి భూముల కేటాయింపును ప్రశ్నిస్తూ ‘సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కు చెందిన జి. శ్రీనివాసరావు ఇటీవల ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలు చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడైంది.
