Let's talk: editor@tmv.in
ఐటీటీఎఫ్ వరల్డ్ కప్: ఉత్కంఠ పోరులో మనికా విజయం

ఐటీటీఎఫ్ వరల్డ్ కప్: ఉత్కంఠ పోరులో మనికా విజయం

Shaik Mohammad Shaffee
1 ఏప్రిల్, 2026

ఐటీటీఎఫ్ వరల్డ్ కప్ 2026లో భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బత్రా గ్రూపు దశను విజయంతో ముగించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్-4 చివరి మ్యాచ్‌లో ప్రపంచ 47వ ర్యాంకర్ మనికా 3-2 (11-7, 11-2, 14-16, 5-11, 11-6) తేడాతో అమెరికాకు చెందిన లిలీ జాంగ్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించింది. తొలి రెండు గేములను అలవోకగా గెలుచుకున్న మనికా, మూడో గేమును కూడా ముగించేలా కనిపించినా.. ప్రత్యర్థి పుంజుకోవడంతో మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో గేముకు దారితీసింది. అయితే ఒత్తిడిలోనూ నిలకడగా ఆడిన మనికా చివరకు విజయాన్ని అందుకుంది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో ఆమె జపాన్ క్రీడాకారిణి మివా హరిమోటో చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

పోరాడి ఓడిన శ్రీజ ఆకుల

మరోవైపు గ్రూప్-2లో బరిలోకి దిగిన భారత క్రీడాకారిణి శ్రీజ ఆకుల (ప్రపంచ 44వ ర్యాంకర్)కు తొలిరోజే నిరాశ ఎదురైంది. పోర్చుగల్‌కు చెందిన అనుభవజ్ఞురాలు ఫు యుతో జరిగిన హోరాహోరీ పోరులో శ్రీజ 1-3 (11-8, 9-11, 13-15, 8-11) తేడాతో ఓటమి పాలైంది. తొలి గేమ్‌ను గెలిచి శుభారంభం చేసినప్పటికీ, తర్వాతి గేముల్లో పోర్చుగల్ క్రీడాకారిణి గట్టి పోటీనివ్వడంతో శ్రీజ వెనుకంజ వేయాల్సి వచ్చింది. నేడు జరగనున్న తన చివరి గ్రూపు మ్యాచ్‌లో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ రెండో ర్యాంకర్ చైనాకు చెందిన వాంగ్ మాన్యుతో శ్రీజ తలపడనుంది.

నేడు కీలక పోరులో మానవ్

పురుషుల విభాగంలో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత ప్లేయర్ మానవ్ థక్కర్ కూడా నేడు తిరిగి బరిలోకి దిగనున్నాడు. స్వీడన్‌కు చెందిన ఒలింపిక్ రజత పతక విజేత, ప్రపంచ నంబర్-2 ట్రుల్స్ మోరెగార్డ్‌తో మానవ్ తలపడనున్నాడు. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం గ్రూపులో అగ్రస్థానంలో నిలిచిన 16 మంది మాత్రమే నాకౌట్ దశకు అర్హత సాధిస్తారు. మనికా బత్రా ఉన్న గ్రూప్-4 విజేత ఎవరో నేడు జరిగే హరిమోటో, లిలీ జాంగ్ మ్యాచ్‌తో తేలనుంది.

చరిత్ర కోసం నిరీక్షణ

ఐటీటీఎఫ్ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఏ భారత టేబుల్ టెన్నిస్ ఆటగాడు పతకం సాధించలేదు. గత 2025 ఎడిషన్‌లో మనికా బత్రా, శ్రీజ ఆకుల పోటీ పడినప్పటికీ గ్రూపు దశను దాటలేకపోయారు. ఈసారైనా నాకౌట్ దశకు చేరుకుని చరిత్ర సృష్టించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

ఐటీటీఎఫ్ వరల్డ్ కప్: ఉత్కంఠ పోరులో మనికా విజయం - Tholi Paluku