
ఐక్యతే మన బలం, సుస్థిరతే భవిత: ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం 127వ 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పండుగ వాతావరణం, పరిశుభ్రత కార్యక్రమాలు, స్వదేశీ శునకాల దత్తత, సర్దార్ పటేల్ జయంతి, భారతీయ కాఫీ ప్రాముఖ్యత, 'వందేమాతరం' 150వ సంవత్సరం, సంస్కృతం పునరుజ్జీవం, కొమురం భీమ్ సాహసం వంటి పలు కీలక అంశాలపై మాట్లాడారు.
పండుగలు, సామాజిక ఐక్యత
దేశం పండుగల ఆనందంలో ఉందని, ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, పూర్వాంచల్ ప్రజలకు ఛత్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఛత్ సంస్కృతి, ప్రకృతి, సమాజాల మధ్య ఐక్యతకు ప్రతీక అని కొనియాడారు. ఒకప్పుడు మావోయిస్టు ఉగ్రవాదం చీకటిలో మగ్గిపోయిన ప్రాంతాలలో కూడా ఆనంద దీపాలు వెలిగాయని, 'ఆపరేషన్ సిందూర్' ప్రతి భారతీయుడిని గర్వంతో నింపిందని అన్నారు పండుగల సమయంలో మార్కెట్లలో స్వదేశీ వస్తువుల కొనుగోలు గణనీయంగా పెరగడంపై సంతోషం వ్యక్తం చేశారు. వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించాలన్న తన అభ్యర్థనకు ప్రజలు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
గార్బేజ్ కేఫ్ (అంబికాపూర్, ఛత్తీస్‌గఢ్): ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువచ్చే వారికి ఉచితంగా భోజనం అందించే గార్బేజ్ కేఫ్‌ను అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోందని, ఇది ఒక కిలో ప్లాస్టిక్‌కు భోజనం, అర కిలోకు అల్పాహారం ఇస్తుందని వివరించారు.
సరస్సుల పునరుద్ధరణ (బెంగళూరు): ఇంజనీర్ కపిల్ శర్మ తన బృందంతో కలిసి బెంగళూరు నగరంలో, పరిసర ప్రాంతాలలో 40 బావులు, ఆరు సరస్సులను కార్పొరేట్‌లు, స్థానిక ప్రజల సహకారంతో పునరుద్ధరించారని అభినందించారు.
మడ అడవుల పెంపకం (గుజరాత్): మడ అడవులు ఉప్పునీటి సముద్రపు నీరు, చిత్తడి నేలలలో పెరుగుతాయని, సునామీ, తుఫానుల సమయంలో ఇవి చాలా సహాయకారిగా ఉంటాయని తెలిపారు. గుజరాత్ అటవీ శాఖ అహ్మదాబాద్ సమీపంలోని ధోలేరా తీరం వెంబడి ఐదేళ్లలో మూడున్నర వేల హెక్టార్లలో మడ అడవులను విస్తరించిందని ప్రశంసించారు. దీనివల్ల డాల్ఫిన్‌లు, పీతలు పెరిగాయని, వలస పక్షులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని చెప్పారు. గుజరాత్‌లోని కచ్‌లో 'మడ అడవుల అధ్యయన కేంద్రాన్ని' కూడా ప్రారంభించినట్టు పేర్కొన్నారు.
వృక్షాల ప్రాముఖ్యత: ఎవరినీ ఎప్పుడూ నిరాశపరచని వృక్షాలు, మొక్కలు ధన్యజీవులని గ్రంథాలలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
భారతీయ జాతి శునకాల దత్తత: భారతీయ జాతి శునకాలు మన పర్యావరణానికి, ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయని, వాటిని దత్తత తీసుకోవాలని కోరిన తరువాత, బి.ఎస్.ఎఫ్., సి.ఆర్.పి.ఎఫ్. వంటి భద్రతా దళాలు ఈ దిశగా గొప్ప ప్రయత్నాలు చేశాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ముధోల్ హౌండ్, కొంబాయి, రాంపూర్ హౌండ్స్ వంటి జాతులకు శిక్షణ ఇస్తున్నారు. భద్రతా దళాలు తమ కుక్కలకు విదేశీ పేర్లకు బదులుగా భారతీయ పేర్లను ఇచ్చే సంప్రదాయాన్ని ప్రారంభించారు. గత ఏడాది లక్నోలో జరిగిన అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌లో బీఎస్ఎఫ్ శిక్షణ పొందిన ముధోల్ హౌండ్ 'రియా' మొదటి బహుమతిని గెలుచుకుంది.
సర్దార్ పటేల్ జయంతి: అక్టోబర్ 31వ తేదీన సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్ ఏక్తా నగర్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద జరిగే 'ఐక్యతా దినోత్సవ పెరేడ్'లో పాల్గొనాలని, దేశవ్యాప్తంగా జరిగే రన్ ఫర్ యూనిటీలో పాల్గొనాలని యువతను కోరారు.
కోరాపుట్ కాఫీ (ఒడిషా): ఒడిషాలోని కోరాపుట్ కాఫీ రుచి అద్భుతంగా ఉంటుందని, కాఫీ సాగు ద్వారా చాలా మంది మహిళలు గౌరవాన్ని, సమృద్ధిని పొందుతున్నారని ప్రశంసించారు. భారతీయ కాఫీ (చిక్‌మగళూరు, కూర్గ్, వయనాడ్ వంటి ప్రాంతాల కాఫీ) ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోందని తెలిపారు.
'వందేమాతరం' 150వ సంవత్సరం: వచ్చే నెల నవంబర్ 7వ తేదీన 'వందేమాతరం' 150వ సంవత్సర వేడుకల్లోకి ప్రవేశించబోతున్నామని తెలిపారు. వందేమాతరం దేశభక్తి, భరతమాత పట్ల ప్రేమకు నిర్దిష్ట స్వరాన్ని ఇచ్చే పాట అని, ఈ గేయం 'మాతా భూమి: పుత్రో అహం పృథ్వీయ:' అనే వేదాల స్ఫూర్తితో ముడిపడి ఉందని వివరించారు. వందేమాతరం 150వ సంవత్సరాన్ని చిరస్మరణీయంగా మార్చాలని, సూచనల కోసం #వందేమాతరం150 హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించాలని అభ్యర్థించారు.
సంస్కృతం పునరుజ్జీవం: సోషల్ మీడియా యుగంలో సంస్కృతం కొత్త జీవితాన్ని పొందిందని, యశ్ సాలుండ్కే (కంటెంట్ క్రియేటర్, క్రికెటర్), కమల, జాహ్నవి (ఆధ్యాత్మికతపై కంటెంట్) వంటి యువ కంటెంట్ సృష్టికర్తలు సంస్కృతంలో ఆసక్తికరమైన పని చేస్తున్నారని అభినందించారు.
కొమురం భీమ్ స్మరణ: నిజాం క్రూరత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు కొమురం భీమ్ జన్మదినోత్సవాన్ని (అక్టోబర్ 22) పురస్కరించుకుని ఆయన ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు. నిజాం అధికారి సిద్ధిఖీని సవాలు చేసి హత్య చేసిన ఆయన సాహసం అద్భుతమని, యువత ఆయన గురించి తెలుసుకోవాలని కోరారు.
ఆదివాసీ గౌరవ దినోత్సవం: వచ్చే నెల 15వ తేదీన భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా 'ఆదివాసీ గౌరవ దినోత్సవం' జరుపుకోబోతున్నామని, ఆయన సేవలకు నివాళులర్పించారు.
తన ప్రసంగాన్ని ముగిస్తూ, సమాజ మార్పు కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తులు/ సమూహాల గురించి తమ కథనాలను పంచుకోవాలని ప్రధాని మోడీ పౌరులను కోరారు.
