
ఐక్యంగా ఉండి మూడు స్థానాలు గెలిచాం: ఫరూక్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా శనివారం తన పార్టీ మూడు రాజ్యసభ స్థానాలను గెలుచుకున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఐక్యతను, అలాగే కాంగ్రెస్, మిత్రపక్షాల మద్దతును ఆయన ప్రశంసించారు. అయితే నాలుగో సీటును కోల్పోవడంపై నిరాశ వ్యక్తం చేస్తూ కొన్ని నెరవేరని హామీల వల్ల అది సాధ్యం కాలేదు అని తెలిపారు.
మా పార్టీ ఎమ్మెల్యేలు అంతా ఐక్యంగా ఉన్నారు. అందుకే మేం ఈ ఎన్నికల్లో విజయం సాధించగలిగాం. ఇతర పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ మాకు మద్దతు ఇచ్చాయి. మేము నాలుగో సీటు కూడా గెలిచే అవకాశం ఉండేది. కానీ సాధ్యం కాలేదు. ఇలాంటి సంఘటనలు ఎన్నికల సమయంలో జరుగుతుంటాయి. బీజేపీ మా వద్దకు వచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని కోరింది, కానీ మేం వారి ప్రతిపాదనను తిరస్కరించాం అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
జమ్మూ కాశ్మీర్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన చౌదరి మొహమ్మద్ రమ్జాన్, సజాద్ కిచ్లూ, షమ్మీ ఓబెరాయ్ గెలిచారు. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సత్ పాల్ శర్మ నాలుగో సీటును కైవసం చేసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని లేకుంటే నాలుగో సీటు కూడా నేషనల్ కాన్పరెన్స్ గెలిచేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే కావాలనే బీజేపీ ఒక సీటును వదిలిపెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ఇది తప్పుడు ఆరోపణలని ఫరూక్ అబ్దుల్లా కొట్టిపారేశారు.
2021 ఫిబ్రవరిలో గులామ్ నబీ ఆజాద్, మీర్ మొహమ్మద్ ఫయాజ్, శంశేర్ సింగ్, నజీర్ అహ్మద్ లవాయ్ పదవీ విరమణ చేసిన తరువాత నుంచి ఈ నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయి.
