
ఐఐటీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ హైదరాబాద్).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐఐటీ హైదరాబాద్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ & ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మ్యాథమ్యాటిక్స్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఇక అభ్యర్థుల విద్యార్హతల విషయానికి వస్తే, తప్పనిసరిగా సంబంధిత విభాగంలో పీహెచ్ డీ పూర్తి చేసి ఉండాలి. అకడమిక్ రికార్డు అత్యుత్తమంగా ఉండాలి. దరఖాస్తు చేస్తున్న ఫ్యాకల్టీ హోదాను బట్టి అనుభవం తప్పనిసరి. ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 35 ఏళ్లు ఉండాలి, 55 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు పదేళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులను వారి విద్యార్హతలు, పరిశోధన ప్రచురణలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, అనంతరం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iith.ac.inను సందర్శించండి. అక్కడ "Careers"లోకి వెళ్లి Faculty విభాగంపై క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. పూర్తిగా చదివి, నోటిఫికేషన్ లో పేర్కొన్న లింక్ ను ఓపెన్ చేయండి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన అన్ని వివరాలను (వ్యక్తిగత, విద్యార్హతలు, అనుభవం, పరిశోధన వివరాలు మొదలైనవి) జాగ్రత్తగా నింపండి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, పరిశోధన పత్రాల కాపీలను అప్‌లోడ్ చేయండి. ఒకవేళ దరఖాస్తు ఫీజు (వర్తిస్తే) చెల్లించండి. పూర్తి చేసిన దరఖాస్తును సబ్మిట్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకోండి.
వేతనం
ఐఐటీలలో ఫ్యాకల్టీ పోస్టులకు భారత ప్రభుత్వ 7వ పే కమిషన్ ప్రకారం జీతం లభిస్తుంది. నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,59,100, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,39,600, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-Iకు రూ.1,01,500, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-IIకు రూ.98,200 వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఐఐటీ హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్ https://www.iith.ac.in/ను సందర్శించండి.
ఐఐటీ హైదరాబాద్ గురించి..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ 2008వ సంవత్సరంలో భారత ప్రభుత్వం స్థాపించిన అగ్రశ్రేణి సాంకేతిక విద్యాసంస్థల్లో ఒకటి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కంది గ్రామం వద్ద 576 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం పరిశోధన, ఆవిష్కరణలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విద్యార్థులకు ప్రపంచ స్థాయి అకడమిక్ వాతావరణాన్ని అందించి, దేశ ప్రగతికి తోడ్పడే అసాధారణ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడం.
ఐఐటీ హైదరాబాద్‌లో ప్రస్తుతం 330 మందికి పైగా అధ్యాపకులు, 350 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. ఇక్కడ దాదాపు 5750 మందికి పైగా విద్యార్థులు (వీరిలో 60 శాతం మంది పీజీ+ పీహెచ్‌డీ విద్యార్థులు) విద్యనభ్యసిస్తున్నారు.
అడ్మిషన్స్, ఫీజు వివరాలు
ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ సీటు పొందడానికి విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో అత్యుత్తమ ర్యాంక్ సాధించాలి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వంటి అత్యంత పోటీ ఉన్న కోర్సులకు ర్యాంక్ దాదాపు 600 నుండి 700 లోపు ఉండాలి. ఇతర ఇంజనీరింగ్ కోర్సులకు ర్యాంకులు 8,000 వరకు కూడా ఉండవచ్చు
ఫీజు: బీటెక్ కోర్సులకు మొత్తం ఫీజు సుమారు రూ.8 లక్షలు వరకు ఉంటుంది. ట్యూషన్ ఫీజు ఒక్కో సెమిస్టర్‌కు సుమారు రూ.లక్ష నుండి రూ.1.20 లక్షల వరకు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది. మెరిట్, ఆర్థిక అవసరాల ఆధారంగా స్కాలర్‌షిప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
