Let's talk: editor@tmv.in
ఐఐటీ గౌహతి విద్యార్థుల ఘనత: ‘గ్లోబల్ 24–అవర్స్’ యానిమేషన్ కాంటెస్ట్ లో ఫస్ట్ ప్రైజ్

ఐఐటీ గౌహతి విద్యార్థుల ఘనత: ‘గ్లోబల్ 24–అవర్స్’ యానిమేషన్ కాంటెస్ట్ లో ఫస్ట్ ప్రైజ్

Pinjari Chand
24 అక్టోబర్, 2025

ప్రపంచ ప్రఖ్యాత 24–అవర్ యానిమేషన్ కాంటెస్ట్ 2025 లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గౌహతి విద్యార్థులు మొదటి స్థానం సాధించారు. 2002 లో ప్రారంభమైన ఈ పోటీల్లో ఇంతకు ముందు దేశం నుంచి ఏ విద్యా సంస్థ గెలవలేదు. ఈ అంతర్జాతీయ పోటీలో 35 దేశాలకు చెందిన 185 సంస్థల నుంచి 764 జట్లు పాల్గోన్నాయి. మొత్తం 3,820 మంది విద్యార్థులు పోటీపడ్డారు. ఈ పోటీలో ఐఐటీ గౌహతి డిజైన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. మృగంక మధుకైల్యా పర్యవేక్షణలో విద్యార్థులైన అరిన్ బంద్యోపాధ్యాయ్, ఆదిత్య రవి పవార్, ఆసీల్ పాషా, ఎస్. బాలశంకర్ జట్టు పోటీ చేసింది.ఈ పోటీని ప్రపంచ ప్రసిద్ధ యానిమేషన్ సంస్థ టూన్ బూమ్ యానిమేషన్ నిర్వహించింది. డిస్నీ, పిక్సార్, సోనీ పిక్చర్స్ యానిమేషన్, నికెలోడియన్, వార్నర్ బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్, డ్రీంవర్క్స్ వంటి సంస్థలు స్పాన్సర్లుగా ఉన్నాయి.

విజేతలైన ఐఐటీ గౌహతి విద్యార్థులకు 2026లో టొరాంటో యానిమేషన్ ఆర్ట్స్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ (టీఏఏఎఫ్ఐ) కు విద్యార్థి పాస్‌లు, ప్రొఫెషనల్ యానిమేషన్ సాఫ్ట్‌వేర్ లైసెన్సులు, స్టూడియో మెంబర్‌షిప్‌లు, డిస్నీ అనిమేటర్లతో మెంటార్‌షిప్ వంటి బహుమతులు లభించనున్నాయి.

ఈ సంవత్సరం పోటీ థీమ్ ‘ప్లిఫ్ యువర్ పర్ స్పెక్టివ్’ (మీ దృష్టికోణాన్ని మార్చండి). 24 గంటల్లో 30 సెకండ్ల యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌ను సృష్టించాల్సిన ఈ పోటీలో ఐఐటీ గౌహతి విద్యార్థుల సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం వారిని విజేతలుగా నిలబెట్టింది. ఐఐటీ గౌహతి డైరెక్టర్, ప్రొఫెసర్ దేవేంద్ర జలిహాల్ మాట్లాడుతూ ఇంతటి స్థాయిలో అంతర్జాతీయ పోటీలో విజయం సాధించడం మా విద్యార్థుల ప్రతిభకు నిదర్శనం. ఇది మా ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న ప్రపంచ స్థాయి ప్రతిభకు ప్రతిబింబం అని విద్యార్థులను ప్రశంసించారు.

పోటీ నియమాల ప్రకారం పాల్గొనేవారు థీమ్ అందుకున్న తర్వాత 24 గంటల్లోనే కథా రూపకల్పన నుంచి తుది యానిమేషన్ వరకు మొత్తం పని పూర్తి చేయాలి. ముందే తయారుచేసిన చిత్రాలు లేదా మోడళ్లు వాడకూడదు. అలాగే విజువల్స్ లేదా సౌండ్ కోసం ఏఐ టూల్స్ వాడటం నిషేధం. డెడ్‌లైన్ తర్వాత ఒక సెకన్ ఆలస్యమైనా పోటీ నుంచి తప్పిస్తారు. ఈ పోటీలను ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. రెండో స్థానంలో కెనడా టీం, మూడో స్థానంలో ఫ్రాన్స్ జట్లు నిలిచాయి.

ఈ కాంటెస్ట్ లో నగదు బహుమతి ఇవ్వరు.

దాని బదులు విజేతలకు ప్రొఫెషనల్ విలువ కలిగిన బహుమతులు ఇస్తారు. ఇవే ఎంతో విలువైనవి.

2025లో ఐఐటీ గౌహతి జట్టు పొందిన బహుమతులు ఇవి

• టోరంటో యానిమేషన్ ఆర్ట్స్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్–2026 కి విద్యార్థులకు పాస్‌లు ఇస్తారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ యానిమేషన్ ఫెస్టివల్, అక్కడ డిస్నీ, పిక్సార్, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థల ప్రొఫెషనల్స్ పాల్గొంటారు.

• ప్రొఫెషనల్ యానిమేషన్ సాఫ్ట్‌వేర్ లైసెన్సులు – టూన్ బూమ్ హర్మోని, స్టోరీ బోర్డ్ ప్రో వంటి అధునాతన సాఫ్ట్‌వేర్‌ల లైసెన్సులను ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు.

• స్టూడియో మెంబర్‌షిప్‌లు, మెంటార్‌షిప్ సెషన్లు – వాల్ట్ డిస్నీ, పిక్సార్, డ్రీమ్ వర్క్స్​ వంటి స్టూడియోల్లో పనిచేసే నిపుణుల నుంచి శిక్షణ, మార్గదర్శనం.

• ప్రత్యేక గుర్తింపు మరియు ఇంటర్న్‌షిప్ అవకాశాలు – కొన్ని స్టూడియోలు గెలిచిన జట్లకు ఇంటర్న్‌షిప్ అవకాశం ఇస్తాయి.

• క్యాష్ ప్రైజ్ లేకపోయినా, ఈ బహుమతుల విలువ వేల డాలర్లకు సమానం. అలాగే విద్యార్థుల కెరీర్‌లో పెద్ద మైలురాయిగా ఉంటుంది.

ఐఐటీ గౌహతి విద్యార్థుల ఘనత: ‘గ్లోబల్ 24–అవర్స్’ యానిమేషన్ కాంటెస్ట్ లో ఫస్ట్ ప్రైజ్ - Tholi Paluku