
ఐఐటీ ఖరగ్‌పూర్–రష్యా విశ్వవిద్యాలయం మధ్య ఎంఓయూ
దేశంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయమైన ఐఐటీ ఖరగ్‌పూర్ రష్యాలోని ఎంప్రెస్ కాథరీన్ II సెయింట్ పీటర్స్ బర్గ్ మైనింగ్ యూనివర్సిటీతో వ్యూహాత్మక అకాడమిక్ భాగస్వామ్య ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. వర్చువల్ కార్యక్రమంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, శాస్త్రవేత్తల మార్పిడి కార్యక్రమాలు, సంయుక్త శాస్త్రీయ పరిశోధనల కోసం అధ్యాపకుల మార్పిడి, విద్యార్థులు, ఉద్యోగ నిపుణుల కోసం సంయుక్త అకాడమిక్ కార్యక్రమాల రూపకల్పనకు ప్రోత్సాహం లభిస్తుందని ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
సోమవారం జరిగిన వర్చువల్ కార్యక్రమంలో సెయింట్ పీటర్స్‌బర్గ్ మైనింగ్ యూనివర్సిటీ రెక్టర్ ప్రొఫెసర్ వ్లాదిమిర్ లిట్వినెంకో, ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుమన్ చక్రబోర్తి పాల్గొన్నారు. ఉన్నత విద్య, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో ఇండో–రష్యా సహకారాన్ని బలోపేతం చేయడం అవసరమని ఇరు సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. మైనింగ్ ఇంజినీరింగ్, పెట్రోలియం ఇంజినీరింగ్, రబ్బర్ టెక్నాలజీ, మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్, జియాలజీ, జియోఫిజిక్స్, అలాగే ఇంధన, భూవిజ్ఞాన రంగాల్లో కృత్రిమ మేధస్సు అనువర్తనాల వంటి విభాగాల్లో ఇరు సంస్థల ఆధునిక పరిశోధనా మౌలిక సదుపాయాలు, నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం భారత–రష్యా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొనసాగుతున్న దీర్ఘకాల సహకారానికి మరింత బలం చేకూర్చుతుందని ప్రకటన పేర్కొంది. శక్తి అవసరాల మార్పులకు అనుగుణంగా సాంప్రదాయ బొగ్గు, పెట్రోలియం వనరుల నుంచి ఎనర్జీ ట్రాన్సిషన్‌కు కీలకమైన ఖనిజాల వరకు మానవ వనరుల అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలకు ఇది దోహదం చేస్తుందని వెల్లడించింది.
