Let's talk: editor@tmv.in
ఐఏఎస్‌లో 1,300, ఐపీఎస్‌లో 505 ఖాళీలు: కేంద్రం

ఐఏఎస్‌లో 1,300, ఐపీఎస్‌లో 505 ఖాళీలు: కేంద్రం

Pinjari Chand
26 మార్చి, 2026

దేశంలో కీలక సివిల్ సర్వీసుల్లో గణనీయమైన ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభకు తెలియజేసింది. అదే సమయంలో రాజ్యసభలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, మరో మూడు సంవత్సరాల్లో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (ఎఫ్‌ఎండీ)ను నిర్మూలించేందుకు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ మాట్లాడుతూ ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌లో మొత్తం 6,877 ఆమోదిత పోస్టుల్లో 5,577 అధికారులు పనిచేస్తుండగా, 1,300 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అలాగే ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌లో 5,099 ఆమోదిత పోస్టుల్లో 4,594 మంది విధుల్లో ఉండగా, 505 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ప్రతి ఏడాది సుమారు 180 మందిని ఐఏఎస్‌లోకి ఎంపిక చేస్తున్నామని, అందులో 4 శాతం స్థానాలు వికలాంగులకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఖాళీలను రిజర్వేషన్ నిబంధనల ప్రకారం భర్తీ చేస్తున్నామని, ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్‌లలో బ్యాక్‌లాగ్ రిజర్వేషన్ పోస్టులు లేవని స్పష్టం చేశారు.

గత ఐదేళ్లలో ఐఏఎస్‌లో ఓబీసీ వర్గానికి చెందిన 245 మంది, ఎస్సీ వర్గానికి చెందిన 135 మంది, ఎస్టీ వర్గానికి చెందిన 67 మంది నియమితులయ్యారని తెలిపారు. ఇదే కాలంలో ఐపీఎస్‌లో ఓబీసీ వర్గానికి చెందిన 255 మంది, ఎస్సీ వర్గానికి చెందిన 141 మంది, ఎస్టీ వర్గానికి చెందిన 71 మంది నియామకాలు జరిగాయని చెప్పారు. అదేవిధంగా ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో 3,193 ఆమోదించిన పోస్టుల్లో 1,029 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. నియామక ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని, అవసరాలకు అనుగుణంగా ఖాళీలను ప్రతి సంవత్సరం భర్తీ చేస్తున్నామని మంత్రి వివరించారు.

పాల ఉత్పత్తి పెరిగింది

ఇక రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర పశుసంవర్థక, డెయిరీ శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ మాట్లాడుతూ, భారత్‌లో పాల ఉత్పత్తి గత 11 ఏళ్లలో దాదాపు 70 శాతం పెరిగి 2024-25 నాటికి 248 మిలియన్ టన్నులకు చేరిందని తెలిపారు. 2014-15లో ఇది 146.3 మిలియన్ టన్నులుగా ఉందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాలు ఉత్పత్తి దేశంగా ఉన్నప్పటికీ, ఎగుమతులు పరిమితంగా ఉన్నాయని, దీనికి ప్రధాన కారణం పుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌ అని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఎఫ్ఎండీ-రహిత సర్టిఫికేషన్ కోరుతున్నందున, వ్యాధి నిర్మూలనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

దేశవ్యాప్తంగా చేపట్టిన టీకా కార్యక్రమాల ఫలితంగా ఎఫ్‌ఎండీ కేసులు గణనీయంగా తగ్గాయని తెలిపారు. 2019లో 132 కేసులు నమోదు కాగా, 2025 నాటికి ఇవి 40కి తగ్గాయని చెప్పారు. ఇప్పటివరకు 132.49 కోట్ల పశువులకు టీకాలు వేసినట్లు వెల్లడించారు. బ్రుసెల్లోసిస్ వ్యాధి నియంత్రణ కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ‘భారత్ పశుధన్’ పోర్టల్ ద్వారా జంతువులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు కేటాయించి, ఇప్పటివరకు 36 కోట్లకు పైగా జంతువులను నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దేశాన్ని వచ్చే మూడు సంవత్సరాల్లో ఎఫ్‌ఎండీ-రహితంగా ప్రకటించే లక్ష్యంతో చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. మొత్తంగా, ఒకవైపు కీలక ప్రభుత్వ సేవల్లో ఖాళీలు కొనసాగుతుండగా, మరోవైపు పశుసంవర్థక రంగంలో ముఖ్యంగా పాల ఉత్పత్తిలో దేశం గణనీయమైన పురోగతి సాధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలియజేసింది.