Let's talk: editor@tmv.in
ఐఎస్‌పీఎల్ మూడవ సీజన్ ఆక్షన్ డిసెంబర్ 9న ముంబయిలో

ఐఎస్‌పీఎల్ మూడవ సీజన్ ఆక్షన్ డిసెంబర్ 9న ముంబయిలో

Koripelli Aditya
2 డిసెంబర్, 2025

భారత్‌లోనే తొలి టెన్నిస్ బాల్ టీ10 లీగ్ అయిన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్) మూడవ సీజన్‌కు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సారి ఆటగాళ్ల ఆక్షన్ డిసెంబర్ తొమ్మిదిన ముంబయిలో జరగనుంది. దేశవ్యాప్తంగా 101 నగరాల నుంచి వచ్చిన 408 మంది ఆటగాళ్లు బరిలోకి దిగనుండగా, ఎనిమిది ఫ్రాంచైజీలు తమ జట్లను మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధమయ్యాయి.

సూరత్‌లోని లాల్‌భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో 2026 జనవరి తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఆరు వరకు ఈ భారీ టోర్నీ జరగనుంది. రిగ్గరస్ ట్రయల్స్ తర్వాత 400 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. వీరిలో 30 మంది అండర్-19 యువతారలు కూడా ఉన్నారు. అదనంగా ప్రతి జట్టు ఒక్కరిని ‘స్కౌట్ పిక్’గా ఎంచుకోవడంతో మొత్తం ఆక్షన్ పూల్ 408కి చేరింది.

ఆటగాళ్లను ఆరు కేటగిరీలుగా విభజించారు, అండర్-19, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్. అందరి బేస్ ప్రైస్ రూ.3 లక్షల నుంచి ప్రారంభం. ఈసారి జట్ల పర్స్‌ను రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్లకు పెంచారు. స్క్వాడ్ సైజ్ 16 నుంచి 18కి విస్తరించుకోవచ్చు. బిడ్డింగ్ హీట్ ఎక్కువైతే ఒక్కసారిగా రూ.1 లక్ష జంప్ చేసే ‘గూగ్లీ పవర్’ అనే కొత్త వీటో ఆప్షన్ కూడా ఫ్రాంచైజీలకు అందుబాటులో ఉంటుంది.

గత సీజన్‌లో లాగానే ఆరు జట్లకు రెండేసి ఆర్‌టీఎం కార్డులు ఉంటాయి. ఏ ఆటగాడికైనా ఫ్రాంచైజీలు ఎంత భారీ మొత్తమైనా వేయొచ్చు. గరిష్ఠ పరిమితి అంటూ ఏమి లేదు. ప్రతి జట్టు తప్పనిసరిగా ప్రతి జోన్ నుంచి కనీసం ఇద్దరు ఆటగాళ్లను తీసుకోవాలి. ప్లేయింగ్ పదకొండులో ఒక అండర్-19 ఆటగాడు, ప్రతి జోన్ నుంచి ఒకరు తప్పనిసరి. అలాగే స్క్వాడ్‌లోని 18 మంది ఆటగాళ్లు సీజన్‌లో కనీసం ఒక మ్యాచ్ అయిన ఆడాల్సిందే.

కొత్తగా ఢిల్లీ సూపర్‌హీరోస్ (సల్మాన్ ఖాన్), అహ్మదాబాద్ లయన్స్ (అజయ్ దేవ్‌గణ్) లీగ్‌లో చేరాయి. డిఫెండింగ్ ఛాంపియన్ మజీ ముంబయి (అమితాబ్ బచ్చన్), టైగర్స్ ఆఫ్ కోల్‌కతా (సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్), శ్రీనగర్ కే వీర్ (అక్షయ్ కుమార్), చెన్నై సింగమ్స్ (సూర్య), బెంగళూరు స్ట్రైకర్స్ (హృతిక్ రోషన్), ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ (రామ్ చరణ్) జట్లతో కలిసి ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. ఈ సారి ప్రతి జట్టు ఒక్క ఆటగాడిని రిటైన్ చేసుకోవచ్చు. సీజన్ ఎంవీపీకి బ్రాండ్ న్యూ పోర్షే 911 కారు బహుమతిగా ఇవ్వనున్నారు. ఇదే భారత ఫ్రాంచైజీ క్రీడల్లో అత్యంత ప్రతిష్ఠాత్మక బహుమతి. అయితే ఐఎస్‌పీఎల్ గురించి కొందరు సభ్యులు వారి అభిప్రాయాలని తెలియజేశారు.

సచిన్ టెండూల్కర్ (కోర్ కమిటీ సభ్యుడు):

‘ఐఎస్‌పీఎల్ మూడో సీజన్ భారత గ్రాస్‌రూట్ క్రికెట్‌కు మరో మైలురాయి. ప్రతి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కొత్త ముఖాలు, బలమైన ప్రతిభ కనిపిస్తోంది. ఈ ఆక్షన్ ఆటగాళ్లకు న్యాయమైన వేదిక. యువకులు ఈ అవకాశాన్ని ఎలా అందుకుంటారో చూడాలని ఉంది.’

అశిష్ షెలార్ (కోర్ కమిటీ సభ్యుడు):

‘101 నగరాల నుంచి ఆటగాళ్లు రావడం అద్భుతం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభకు ఇది నిదర్శనం. ఐఎస్‌పీఎల్ ఎంత త్వరగా పెరిగిందో, దేశంలో ఎంత నమ్మకం సంపాదించిందో ఇది చూపిస్తోంది.’

మీనల్ అమోల్ కాలే (కోర్ కమిటీ సభ్యురాలు):

‘ట్రయల్స్‌లో ఆకట్టుకున్న ఎంతో మంది యువతకు ప్రతిభ ఉంది. ఈ ఆక్షన్‌లో జోరుదార్ బిడ్డింగ్, సర్‌ప్రైజ్ జట్ల కాంబినేషన్లు ఉంటాయి. కొత్త స్టార్లు ఎవరు రాణిస్తారో చూడడానికి ఆత్రుతగా ఉంది.’

సూరజ్ సామత్ (లీగ్ కమిషనర్):

‘ఈ ఆక్షన్ ప్రొఫెషనల్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాం. గూగ్లీ పవర్, టెక్నాలజీ, అనలిటిక్స్, అన్నీ పారదర్శకంగా, న్యాయంగా ఉంటాయి. పెద్ద పర్స్, పెద్ద స్క్వాడ్‌తో జట్లకు మరింత స్వేచ్ఛ ఉంది. ఈ సారి ప్రతిభ స్థాయి చూస్తే, ఆక్షన్ హోరెత్తించేలా ఉంటుంది.’ ఐఎస్‌పీఎల్ మూడో సీజన్ మరింత ఘనంగా, ఉత్సాహంగా సాగబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభకు ఇదో బంగారు అవకాశం.