
ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శన
అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత తుపాకీ వీరులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. గేమ్స్ మొదలైన తొలి రోజే భారత పతాకాన్ని ఎగురవేస్తూ పిస్టల్ విభాగంలో రవీందర్ సింగ్ బంగారు పతకాన్ని సాధించాడు. అలాగే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఒలింపియన్ ఎలావెనిల్ వలరీవన్(తమిళనాడు) కాంస్య పతకంతో భారత్‌కు గర్వకారణంగా నిలిచింది.
రవీందర్ సింగ్‌కి స్వర్ణం
పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో 47 మంది పోటీదారుల్లో రవీందర్ 569 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. ఆయనతో పాటు కమల్‌జీత్ (540 పాయింట్లు, 20వ స్థానం), యోగేష్ కుమార్ (537 పాయింట్లు, 24వ స్థానం) కలిసి టీమ్ ఈవెంట్‌లో రజత పతకాన్ని కూడా భారత్ ఖాతాలో వేశారు.
ఎలావెనిల్ అద్భుతం – ప్రపంచ స్థాయిలో మొదటి వ్యక్తిగత పతకం
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్‌లో ఎలావెనిల్ అద్భుతమైన ప్రదర్శనతో కాంస్యాన్ని సాధించింది. అర్హత రౌండ్‌లో 633.4 పాయింట్లతో ఐదవ స్థానంలో నిలిచి ఫైనల్‌కి అర్హత సాధించింది. ఫైనల్‌లో మొదటి షాట్ నుంచే అద్భుతంగా షూట్ చేస్తూ కొరియా ఒలింపిక్ చాంపియన్ బాన్ హ్యోజిన్‌తో పోటీ పడింది. 17వ షాట్‌లో 10.9 పాయింట్ల బుల్స్ ఐ తో ముందంజలోకి వెళ్లిన ఆమె, చివరి రౌండ్లలో కొంత వెనుకబడినా 10.6 పాయింట్లతో తన పతకాన్ని ఖరారు చేసుకుంది. ఫైనల్‌లో బాన్ 255.0 పాయింట్లతో స్వర్ణం, చైనాకు చెందిన వాంగ్ జిఫెయ్ రజతం సాధించగా ఎలావెనిల్ కాంస్యాన్ని కైవసం చేసుకుంది.
ఎలావెనిల్ మాటల్లో
ఇది నా కెరీర్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనల్. చివరి వరకు గట్టి పోటీ ఎదురైంది. ఈ విజయం నన్ను మరింత ప్రేరేపించింది అని ఎలావెనిల్ వెల్లడించింది. కైరోలో భారత తుపాకీ వీరులు తొలి రోజే మెరుపులు మెరిపించగా, మిగిలిన ఈవెంట్లలోనూ పతకాల వేట కొనసాగిస్తామనే నమ్మకాన్ని జట్టు వ్యక్తం చేసింది.
టీమ్ ఈవెంట్‌లో మరో కాంస్యం
ఎలావెనిల్‌తో పాటు మేఘనా సజ్జనార్ (631.2), శ్రేయా అగర్వాల్ (628.7) కలిసి టీమ్ ఈవెంట్‌లో కూడా కాంస్య పతకాన్ని సాధించారు.
ఇతర ఫలితాలు
పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్‌లో అనీష్ 291 పాయింట్లు, సమీర్ 286, ఆదర్శ్ సింగ్ 285 స్కోరు చేశారు. రెండవ దశలో ఆరుగురు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధించనున్నారు. మహిళల 50 మీటర్ల పిస్టల్‌లో ప్రియాంకా పటేల్ (533 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచింది.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా 632.5 పాయింట్లతో ఫైనల్‌కి అర్హత సాధించే అవకాశముంది.
