Let's talk: editor@tmv.in
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐశ్వర్య్‌‌కు రజతం

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐశ్వర్య్‌‌కు రజతం

Shaik Mohammad Shaffee
12 నవంబర్, 2025

భారత ఒలింపియన్ షూటర్ ఐశ్వర్య్‌ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ ఈజిప్ట్‌లోని కైరోలో మంగళవారం జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో ఐశ్వర్య్‌ రజత పతకం సాధించాడు. అంతేకాకుండా ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లోని క్వాలిఫికేషన్ రౌండ్‌లో ప్రపంచ రికార్డును సమం చేయడం ద్వారా ఐశ్వర్య్‌ సత్తా చాటాడు. 24 ఏళ్ల ఐశ్వర్య్‌ క్వాలిఫికేషన్ రౌండ్‌లో 597-40x స్కోరు నమోదు చేసి, ఈ విభాగంలో ఉన్న ప్రపంచ రికార్డు మార్కును సమం చేశాడు.

క్వాలిఫికేషన్‌లో అదరగొట్టిన ఐశ్వర్య్‌ ఫైనల్‌లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. చివరి వరకు స్వర్ణం కోసం పోరాడి స్వల్ప తేడాతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఐశ్వర్య్‌ ఫైనల్‌లో మొత్తం 466.9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన యుకున్ లియు కేవలం 0.2 పాయింట్ల స్వల్ప తేడాతో (467.1 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకున్నాడు. ఫ్రాన్స్‌కు చెందిన రోమైన్ ఆఫ్రేర్ 454.8 పాయింట్లతో కాంస్యం సాధించాడు. మరోవైపు భారత షూటర్ నీరజ్ కుమార్ కూడా క్వాలిఫికేషన్స్‌లో 592 స్కోరుతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఫైనల్‌కు అర్హత సాధించి 432.6 పాయింట్లు సాధించి ఐదవ స్థానంలో నిలిచాడు.

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐశ్వర్య్‌‌కు రజతం - Tholi Paluku