Let's talk: editor@tmv.in
ఐఎస్ఎల్, ఐ-లీగ్ అనిశ్చితిపై ఫీఫాకు భారత ఫుట్‌బాల్ ఆటగాళ్ల విజ్ఞప్తి

ఐఎస్ఎల్, ఐ-లీగ్ అనిశ్చితిపై ఫీఫాకు భారత ఫుట్‌బాల్ ఆటగాళ్ల విజ్ఞప్తి

Praveen Kumar
4 జనవరి, 2026

భారత దేశీయ ఫుట్‌బాల్ తీవ్రమైన అనిశ్చితిని ఎదుర్కొంటోంది. దేశంలోని అగ్రశ్రేణి ఫుట్‌బాల్ లీగ్ అయిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్), అలాగే రెండో స్థాయి ఐ-లీగ్‌కు వాణిజ్య భాగస్వామి లభించకపోవడంతో 2025–26 సీజన్ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో భారతీయులతో పాటు విదేశీ ప్రముఖ ఆటగాళ్లు కలిసి ప్రపంచ ఫుట్‌బాల్ పాలక సంస్థ ఫీఫా జోక్యం కోరుతూ సంయుక్త విజ్ఞప్తి చేశారు.

సాధారణంగా సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ఐఎస్ఎల్, జనవరి నెల వచ్చినప్పటికీ మ్యాచ్‌లు లేకుండా నిలిచిపోవడం వల్ల ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, క్లబ్బులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. తమ జీవనోపాధి, వృత్తిపరమైన భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొన్నట్లు ఆటగాళ్లు తెలిపారు.

భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛేత్రీ, గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సందు, డిఫెండర్ సందేశ్ ఝింగన్, ముంబయి సిటీ ఆటగాడు లాలియాంజువాలా చాంగ్తే, ఒడిశా ఎఫ్‌సీకి చెందిన ఫ్రెంచ్ ఆటగాడు హ్యూగో బౌమస్, స్పెయిన్‌కు చెందిన కార్లోస్ డెల్గాడో సహా పలువురు ఆటగాళ్లు వీడియో సందేశం ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

“మేము ప్రస్తుతం మానవీయ, క్రీడా, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఇది రాజకీయ అంశం కాదు. పరిస్థితుల తీవ్రత వల్లే ఈ విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది,” అని ఆటగాళ్లు పేర్కొన్నారు.

సునీల్ ఛేత్రీ మాట్లాడుతూ, “ఆటగాళ్లు, సిబ్బంది, క్లబ్ యజమానులు, అభిమానులు అందరికీ స్పష్టత, భద్రత, ముఖ్యంగా ఒక భవిష్యత్ అవసరం” అని అన్నారు.

ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఆల్ ఇండియా ఫుట్‌బాల్ సమాఖ్య ,ఇండియన్ సూపర్ లీగ్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ సంస్థ మధ్య ఉన్న 15 ఏళ్ల మాస్టర్ హక్కుల ఒప్పందం 2025 చివరితో ముగియడమే. ఒప్పందం ముగిసిన అనంతరం లీగ్ వాణిజ్య హక్కుల కోసం సమాఖ్య టెండర్ ప్రక్రియ చేపట్టింది. అయితే 2025 నవంబర్‌లో బిడ్లకు గడువు ముగిసినా ఒక్క బిడ్ కూడా రాకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

లీగ్ పునఃప్రారంభానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే జోక్యం చేసుకుంది. 2025 సెప్టెంబర్‌లో లీగ్ పునరుద్ధరణకు సంబంధించిన ప్రతిపాదనకు కోర్టు ఆమోదం తెలిపి, 2025–26 సీజన్‌ను సకాలంలో ప్రారంభించాలని ఆదేశించింది. టెండర్ ప్రక్రియ పర్యవేక్షణకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ నాగేశ్వరరావును నియమించినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన పరిష్కారం కనిపించలేదు.

లీగ్‌లు నిలిచిపోవడంతో అనేక మంది ఆటగాళ్లు ఉపాధి భద్రత లేకుండా ఉన్నారు. క్లబ్బులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, భారత ఫుట్‌బాల్ వ్యవస్థ మొత్తం స్థంభించే ప్రమాదం ఉందని క్రీడా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫీఫా తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు భారత ఫుట్‌బాల్ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.