Let's talk: editor@tmv.in
ఐఎంఏ నుంచి తొలి మహిళా అధికారిణిగా సాయి జాదవ్‌

ఐఎంఏ నుంచి తొలి మహిళా అధికారిణిగా సాయి జాదవ్‌

Shaik Mohammad Shaffee
19 డిసెంబర్, 2025

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన 23 ఏళ్ల సాయి జాదవ్ భారత సైన్యంలో సరికొత్త చరిత్ర లిఖించారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ) స్థాపించిన 93 ఏళ్లలో ఇప్పటివరకు కేవలం పురుషులు మాత్రమే ఆఫీసర్లుగా శిక్షణ పొందేవారు. కానీ, ఆ సంప్రదాయాన్ని చెరిపివేస్తూ, శిక్షణ పూర్తి చేసుకున్న మొదటి మహిళా టెరిటోరియల్ ఆర్మీ అధికారిణిగా సాయి నిలిచారు.

కుటుంబ వారసత్వాన్ని కాపాడుతూ..

సాయి జాదవ్ కుటుంబానికి సైన్యంతో విడదీయరాని బంధం ఉంది. ఆమె తండ్రి సందీప్ జాదవ్ ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్నారు. సాయి వాళ్ళ కుటుంబంలో దేశానికి సేవ చేస్తున్న నాలుగో తరం వ్యక్తి కావడం విశేషం. చిన్నప్పటి నుండి సైనిక వాతావరణంలో పెరగడం వల్ల ఆమెకు కూడా దేశ సేవ చేయాలనే పట్టుదల కలిగింది.

ఒక్క పోస్టుకే పోటీ పడి విజయం

సాయి ప్రస్తుతం దూరవిద్య ద్వారా ఎంబీఏ చదువుతోంది. చదువుకుంటూనే ఆమె టెరిటోరియల్ ఆర్మీ పరీక్షల కోసం సిద్ధమైంది. 2023 డిసెంబర్‌లో జరిగిన పరీక్షలో, మహిళా అధికారుల కోసం కేవలం ఒక్కటంటే ఒక్క పోస్టు మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీలో సాయి టాపర్‌గా నిలిచి ఆ ఉద్యోగాన్ని దక్కించుకుంది. గత వారం జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆమె 'లెఫ్టినెంట్' హోదాలో విధుల్లోకి చేరారు.

ముఖ్యమంత్రి అభినందనలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సాయిని అభినందించారు. "మన మరాఠీ అమ్మాయి చరిత్ర సృష్టించింది. ఇది కేవలం ఆమె ఒక్కరి విజయం మాత్రమే కాదు, దేశంలోని కోట్లాది మంది యువతుల కలలకు ఇదొక స్ఫూర్తిదాయకమైన మైలురాయి" అని ఆయన కొనియాడారు. సాయి సాధించిన ఈ విజయం గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతో మంది యువతులకు రక్షణ రంగం వైపు అడుగులు వేయడానికి ధైర్యాన్ని ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఐఎంఏ నుంచి తొలి మహిళా అధికారిణిగా సాయి జాదవ్‌ - Tholi Paluku