Let's talk: editor@tmv.in
ఐఆర్‌సీటీసీ కేసులో లాలూ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఐఆర్‌సీటీసీ కేసులో లాలూ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Pinjari Chand
6 జనవరి, 2026

ఐఆర్‌సీటీసీ హోటల్ స్కామ్ కేసులో తనపై నమోదైన ఆరోపణలపై ట్రయల్ కోర్టు చార్జీలు ఫ్రేమ్ చేసిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర రైల్వే మాజీ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దాఖలు చేశారు. దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. జస్టిస్ స్వరణకాంత శర్మ ఈ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి నోటీసులు జారీ చేసి, సమాధానం దాఖలు చేయాలని ఆదేశించారు. అయితే ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై తక్షణ ఉపశమనం ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. చార్జీల ఫ్రేమింగ్‌పై స్టే ఇవ్వలేదు. ఈ కేసులో స్టే పిటిషన్‌పై వాదనలు వినేందుకు జనవరి 14కు విచారణను వాయిదా వేసింది. మీరు కౌంటర్ దాఖలు చేయండి. స్టే అంశంపై నేను వాదనలు వింటానని జస్టిస్ వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ యాదవ్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, మణీందర్ సింగ్ వాదనలు వినిపించగా, వారితో పాటు ఏక్తా వత్స, వరుణ్ జైన్, నవీన్ కుమార్ న్యాయవాదులు హాజరయ్యారు. సీబీఐ తరఫున అదనపు సాలిసిటర్ జనరల్ డి.పి. సింగ్, అడ్వకేట్ మను మిశ్రా వాదనలు వినిపించారు.

ఈ కేసులో అక్టోబర్ 2025లో లాలూ ప్రసాద్ యాదవ్‌పై అవినీతి, క్రిమినల్ కుట్ర ఆరోపణలతో ట్రయల్ కోర్టు చార్జీలు ఫ్రేమ్ చేసింది. ఆయనతో పాటు ఆయన భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, అలాగే బీహార్ అసెంబ్లీలో ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌లపై కూడా కేసులు నమోదు అయ్యాయి. రౌస్ అవెన్యూ కోర్టులలోని ప్రత్యేక న్యాయమూర్తి (అవినీతి నిరోధక చట్టం) విశాల్ గోగ్నే, లాలూ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో తన అధికారాలను దుర్వినియోగం చేసి, భూకేటాయింపులకు సంబంధించిన టెండర్ అర్హత నిబంధనలను మార్చారని వ్యాఖ్యానించారు. ఈ కుట్రకు లాలూ యాదవ్ పూర్తిగా అవగాహనతోనే నిర్ణయ ప్రక్రియలో జోక్యం చేసుకున్నారని, దీని వల్ల ప్రజాధనానికి భారీ నష్టం వాటిల్లిందని కోర్టు పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించి 2017లో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 2004 నుంచి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో, పాట్నా, పూరీ ప్రాంతాల్లోని ఐఆర్‌సీటీసీ హోటళ్ల టెండర్లను అనుకూల వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నారని సీబీఐ ఆరోపిస్తోంది. ప్రతిఫలంగా విలువైన భూములు, షేర్ల రూపంలో లంచాలు తీసుకున్నారని సీబీఐ అభియోగం. దర్యాప్తు పూర్తి చేసిన అనంతరం, లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఇతర నిందితులపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

ఐఆర్‌సీటీసీ కేసులో లాలూ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు - Tholi Paluku