Let's talk: editor@tmv.in
ఐఆర్‌‌సీటీసీపై కేంద్ర సమాచార కమిషన్ ఆగ్రహం

ఐఆర్‌‌సీటీసీపై కేంద్ర సమాచార కమిషన్ ఆగ్రహం

Pinjari Chand
6 ఏప్రిల్, 2026

ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పోరేషన్‌ (ఐఆర్‌‌సీటీసీ ) టెండర్లలో పాల్గొన్న కంపెనీలు తమపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించాయా అనే అంశంపై సమాచారాన్ని ఇవ్వకుండా నిరాకరించడంపై కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) తీవ్రంగా స్పందించింది. సంబంధిత ఆర్‌‌టీఐదరఖాస్తును మళ్లీ పరిశీలించి సరైన కారణాలతో కొత్త సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ఒక ఆర్‌‌టీఐ దరఖాస్తుదారు టెండర్లలో పాల్గొన్న కంపెనీలు తమపై ఉన్న కేసులను వెల్లడించాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి సమాచారాన్ని కోరారు. ముఖ్యంగా 2015లో వెలుగులోకి వచ్చిన రైల్‌ నీర్‌‌ స్కాం కేసుతో సంబంధం ఉన్న సంస్థలు టెండర్ పత్రాల్లో తమపై ఉన్న విచారణలను పేర్కొన్నాయా అనే వివరాలు అడిగారు. ఈ కుంభకోణంలో ప్రైవేట్ కేటరింగ్ కంపెనీలు ప్రీమియం రైళ్లలో అందించాల్సిన ‘రైల్ నీర్’ బాటిల్ నీటికి బదులుగా తక్కువ ధర కలిగిన నీటిని సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో భారతీయ రైల్వేలకు సుమారు రూ.19.5 కోట్ల నష్టం వాటిల్లిందని విచారణలో బయటపడింది.

దరఖాస్తుదారు టెండర్లలో పాల్గొన్న సంస్థలు తమపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌‌లు, అలాగే ఈడీ కేసుల వివరాలను వెల్లడించాయా అనే సమాచారాన్ని కోరారు. అలాగే దాడులు, నగదు స్వాధీనం, చార్జ్‌షీట్లు వంటి వివరాలు టెండర్ పత్రాల్లో పేర్కొన్నాయా అనే విషయాన్ని కూడా అడిగారు.

ఎందుకు ఇవ్వలేదో.. కారణాలు చెప్పండి

అయితే ఐఆర్‌‌సీటీసీ ఈ సమాచారాన్ని ఇవ్వలేమని తెలిపింది. ఆర్‌‌టీఐ చట్టంలోని సెక్షన్‌ 8(1)(డీ) ప్రకారం ఇది వాణిజ్య గోప్యతకు సంబంధించిన సమాచారం కావడంతో వెల్లడించలేమని సమాధానం ఇచ్చింది. కానీ ఈ వివరణ సరిపోదని సీఐసీ పేర్కొంది. కేవలం చట్టంలోని మినహాయింపు సెక్షన్‌ను పేర్కొనడం సరిపోదని, ఆ సెక్షన్ ఈ కేసుకు ఎలా వర్తిస్తుందో స్పష్టంగా వివరించాలని పేర్కొంది. సమాచారం ఇవ్వకుండా నిరాకరించాలంటే స్పష్టమైన కారణాలు చూపాల్సిందేనని సీఐసీ స్పష్టం చేసింది. అందువల్ల ఈ ఆర్‌‌టీఐ దరఖాస్తును మళ్లీ పరిశీలించి సమగ్రంగా, కారణాలతో కూడిన కొత్త సమాధానం ఇవ్వాలని ఐఆర్‌‌సీటీసీని ఆదేశించింది.

ఐఆర్‌‌సీటీసీపై కేంద్ర సమాచార కమిషన్ ఆగ్రహం - Tholi Paluku