Let's talk: editor@tmv.in
‘ఐఆర్‌సీటీసీ’నుంచి 3 కోట్లకుపైగా నకిలీ ఖాతాలు తొలగించాం: అశ్విని వైష్ణవ్

‘ఐఆర్‌సీటీసీ’నుంచి 3 కోట్లకుపైగా నకిలీ ఖాతాలు తొలగించాం: అశ్విని వైష్ణవ్

Pinjari Chand
26 మార్చి, 2026

రైల్వే టికెట్లను అక్రమంగా విక్రయించే దళారులను అరికట్టేందుకు చర్యల భాగంగా ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పోరేషన్‌ పోర్టల్ నుంచి 3 కోట్లకుపైగా నకిలీ ఖాతాలను తొలగించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో దూరప్రాంత రైళ్లలో అధిక రద్దీపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. టికెట్లను అక్రమంగా కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించే దళారుల సమస్యను ఎదుర్కొనేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ చర్యల వల్ల నిజమైన ప్రయాణికులకు టికెట్లు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రైళ్లలో సౌకర్యవంతమైన, అందుబాటు ధరల సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రైళ్లలో సుమారు 70 శాతం కోచ్‌లు జనరల్, స్లీపర్ తరగతులకు చెందినవేనని, మొత్తం సీట్లలో 78 శాతం నాన్-ఏసీ వర్గానికి చెందినవేనని తెలిపారు.

పీక్ సీజన్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 75,000కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపినట్లు చెప్పారు. యూపీఏ ప్రభుత్వ కాలంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. రైల్వే భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని మంత్రి తెలిపారు. గతంతో పోలిస్తే ప్రమాదాలు 90 శాతం వరకు తగ్గాయని చెప్పారు. ఇదిలా ఉండగా, లోక్‌సభలో మాజీ సభ్యులు విష్ణు మోడీ, దత్తా మెఘే మరణంపై సంతాపం ప్రకటించారు. వారికి గౌరవంగా సభలో స్పీకర్ ఓం బిర్లా సహా సభ్యులు కొద్ది సేపు మౌనం పాటించారు. సభ ప్రారంభానికి ముందు అజెండాను పరిశీలించి రావాలని సభ్యులకు స్పీకర్ సూచించారు, ఎందుకంటే కొందరు సభ్యులు నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించినట్లు పేర్కొన్నారు.

8 గంటల ముందు రైలు టికెట్ రద్దు చేస్తే రీఫండ్ లేదు

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైలు టికెట్ రద్దు నిబంధనల్లో కీలక మార్పులు ప్రకటించారు. ఈ కొత్త నియమాలు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య అమల్లోకి రానున్నాయి. ప్రయాణానికి 8 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ఉండదు (ఇప్పటివరకు ఇది 4 గంటలు)

• 24 నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే → టికెట్ ధరలో 50 శాతం కట్

• 72 నుంచి 24 గంటల మధ్య రద్దు → 25శాతం కట్

• 72 గంటల కంటే ముందే రద్దు చేస్తే → చిన్న చార్జ్ మినహా పూర్తి రీఫండ్

ఇతర సౌకర్యాలు

కౌంటర్ టికెట్ ఉన్నవారు ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు క్లాస్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. బోర్డింగ్ పాయింట్‌ను కూడా 30 నిమిషాల ముందు మార్చుకునే అవకాశం కల్పించారు. టికెట్ బ్లాక్ మార్కెటింగ్, ఏజెంట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

‘ఐఆర్‌సీటీసీ’నుంచి 3 కోట్లకుపైగా నకిలీ ఖాతాలు తొలగించాం: అశ్విని వైష్ణవ్ - Tholi Paluku