Let's talk: editor@tmv.in
ఏ రాష్ట్రంపైనా ఎన్ఈపీ ఒక్క భాషను రుద్దదు: కేంద్ర విద్యాశాఖ

ఏ రాష్ట్రంపైనా ఎన్ఈపీ ఒక్క భాషను రుద్దదు: కేంద్ర విద్యాశాఖ

Pinjari Chand
24 మార్చి, 2026

జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ-2020) ఏ రాష్ట్రంపైనా హిందీ సహా ఏ ఒక్క భాషను రుద్దదని, బహుభాషా విధానాన్ని స్పష్టంగా ప్రోత్సహిస్తుందని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్‌ చౌదరి తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల అదనపు ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ఈపీపై తమిళనాడు రాష్ట్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష పథకం కింద ఆ రాష్ట్రానికి రూ.538 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. ఖర్చు విధానం, యుటిలైజేషన్ సర్టిఫికెట్ (యూసీ) సమర్పణ వంటి ప్రక్రియలను రాష్ట్రం అనుసరించాలి. తద్వారా తదుపరి నిధులు విడుదల అవుతాయని చెప్పారు. అసలు ఏ భాషను రుద్దడం లేదు. ఎన్ఈపీలో ప్రతిపాదించిన మూడు భాషల విధానం, రెండు భాషల ఫార్ములాతో సరిపోతుంది. పూర్తి స్వేచ్ఛ ఉంది. రాష్ట్రాలు తమ ఇష్టప్రకారం అమలు చేసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

ఎన్ఈపీ పారా 4.13లో బహుభాషా విధానాన్ని స్పష్టంగా ప్రోత్సహించిందని, చిన్నప్పటి నుంచే అనేక భాషలను నేర్చుకోవడం వల్ల విద్యార్థుల నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. ఈ విధానం ప్రకారం, విద్యార్థులు 15 ఏళ్ల వయస్సు వచ్చేలోపు కనీసం రెండు భారతీయ భాషల్లో ప్రావీణ్యం సాధించాలి. మూడో భాష స్థానిక అవసరాల ప్రకారం నిర్ణయించవచ్చని చెప్పారు. సమగ్ర శిక్ష పథకం కింద భాషా ఉపాధ్యాయుల నియామకానికి కేంద్రం సహాయం అందిస్తున్నట్లు, ఇది సమగ్రశిక్ష 2.0లో కొత్తగా చేర్చిన అంశమని వివరించారు. తమిళనాడు ఎన్ఈపీపై అభ్యంతరాలను పలుమార్లు వ్యక్తం చేసినట్టు, ముఖ్యంగా మూడు భాషల విధానాన్ని రెండు భాషల ఫార్ములాగా మార్చినందునే ఈ వివాదం నెలకొన్నదని చెప్పారు.

అదేవిధంగా, ప్రధాని పీఎం-శ్రీ పాఠశాలల ఒప్పందంపై తమిళనాడు ఇప్పటికీ సంతకం చేయలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా 14,000కి పైగా పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేయడమే ఈ పథకం లక్ష్యమని చెప్పారు. జాతీయ విధానాన్ని అంగీకరిస్తే, పీఎం-శ్రీ పాఠశాలలను కూడా మద్దతు ఇవ్వాలి. లేకపోతే తమిళనాడులో లక్షలాది విద్యార్థులు ఈ ప్రయోజనాలను కోల్పోతున్నారని మంత్రి పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఎన్ఈపీ, పీఎం-శ్రీ పాఠశాలలపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకే కేంద్రం సమగ్ర శిక్ష నిధులను నిలిపివేసిందని రాష్ట్రం ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ వివాదం కొనసాగుతోంది.

బీఈడీ కోర్సును మళ్లీ ఏడాది కాలానికి తగ్గించే యోచన లేదు

బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సు వ్యవధిని మళ్లీ ఒక సంవత్సరానికి తగ్గించే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. లోక్‌సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహయ మంత్రి జయంత్‌ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో ఉపాధ్యాయ విద్యా కోర్సులకు ప్రమాణాలు నిర్దేశించే సంస్థ అయిన ఎన్‌సీటీఈ నుంచి అందిన సమాచార ప్రకారం, ప్రస్తుతం బీఈడీ కోర్సు వ్యవధిని ఒక సంవత్సరానికి పునరుద్ధరించే ప్రతిపాదన లేదని మంత్రి తెలిపారు. గత ఏడాది ఎన్‌సీటీఈ, 2014లో రద్దు చేసిన ఒక సంవత్సర బీఈడీ కోర్సును మళ్లీ ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) సిఫార్సులకు అనుగుణంగా ఈ మార్పును పరిశీలిస్తున్నట్లు అప్పట్లో తెలిపింది.

దేశ చమురు నిల్వలు 64శాతం మాత్రమే: సురేశ్‌ గోపి

అత్యవసర పరిస్థితుల్లో ఇంధన సరఫరాకు భరోసాగా ఉండే దేశ వ్యూహాత్మక చమురు నిల్వలు ప్రస్తుతం కేవలం రెండు, మూడవ వంతు మాత్రమే నిండినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ సహయ మంత్రి సురేశ్‌గోపి తెలిపారు. ప్రస్తుతం ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ వద్ద సుమారు 3.372 మిలియన్ టన్నుల ముడి చమురు నిల్వ ఉందని, ఇది మొత్తం సామర్థ్యంలోని 64 శాతమని చెప్పారు. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇంధన వినియోగ దేశం. దేశ అవసరాల్లో సుమారు 88 శాతం ముడి చమురు దిగుమతులపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో సరఫరాలో అంతరాయం లేదా ధరాఘాతం ఏర్పడినప్పుడు 9.5 రోజులపాటు అవసరాలను తీర్చేందుకు వ్యూహాత్మక నిల్వలను ఏర్పాటు చేశారు. మార్కెట్ పరిస్థితులు, వినియోగంపై ఆధారపడి నిల్వల పరిమాణం మారుతూ ఉంటుంది. ఇది స్థిరంగా ఉండదని మంత్రి తెలిపారు.

దేశంలో మొత్తం 5.33 మిలియన్ టన్నుల సామర్థ్యంతో మూడు భూగర్భ నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగుళూరు, పడూర్‌‌ ప్రాంతాల్లో ఉన్నాయి. మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ పరిస్థితులు ఏర్పడటంతో చమురు, సహజ వాయువు, ఎల్పీజీ సరఫరాలపై ప్రభావం పడిన నేపథ్యంలో ఈ నిల్వలు ప్రాధాన్యత పొందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 11 నెలల్లో భారత్ సుమారు 226 మిలియన్ టన్నుల చమురు దిగుమతి చేసుకుని, దానికి 110 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇక సహజ వాయువు దిగుమతులపై ఏప్రిల్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు 12.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. దేశంలో వినియోగించే ఎల్పీజీలో 60 శాతం విదేశాల నుంచే వస్తోంది. చమురు సరఫరాలో అంతరాయం కొంతవరకు రష్యా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా, లాటిన్ అమెరికా వంటి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా భర్తీ చేస్తున్నప్పటికీ, గ్యాస్, ఎల్పీజీ సరఫరాలు మాత్రం కొంత మేరకు తగ్గించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.