Let's talk: editor@tmv.in
ఏ భాషను బలవంతంగా రుద్దే అవకాశం లేదు: సీఎం విజయన్

ఏ భాషను బలవంతంగా రుద్దే అవకాశం లేదు: సీఎం విజయన్

Pinjari Chand
11 జనవరి, 2026

మలయాళ భాషా బిల్లు–2025పై కొనసాగుతున్న వివాదం, కర్ణాటకతో ఏర్పడుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. కేరళ శాసనసభ ఆమోదించిన ఈ బిల్లు వాస్తవాలు, సమావిష్కృత స్వభావాన్ని విమర్శలు ప్రతిబింబించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ చట్టంలో భాషా అల్పసంఖ్యాకుల హక్కులను పూర్తిగా కాపాడే నిబంధనలు ఉన్నాయని చెప్పారు. శుక్రవారం ఎక్స్ లో చేసిన పోస్టులో విజయన్ మాట్లాడుతూ సమానత్వం, సోదరభావం ఆధారంగా సమగ్ర అభివృద్ధే కేరళ ప్రగతికి పునాది. సెక్యులరిజం, బహుళత్వం వంటి రాజ్యాంగ విలువలను పరిరక్షించడంలో మా ప్రభుత్వం అచంచలంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

బలవంతానికి తావులేదు: సీఎం

మలయాళ భాష బిల్లు ఉద్దేశాన్ని వివరిస్తూ, ఈ చట్టంలో స్పష్టమైన ‘నాన్-ఆబ్స్టాంటే క్లాజ్’ (క్లాజ్–7) ఉందని విజయన్ తెలిపారు. ఈ నిబంధన ముఖ్యంగా కన్నడ, తమిళ భాషలు మాట్లాడే భాష అల్పసంఖ్యాకుల హక్కులను సంపూర్ణంగా రక్షిస్తుందని చెప్పారు. ఏ పౌరుడిపైనా ఏ భాషను బలవంతంగా విధించే ప్రశ్నే లేదు అని ఆయన స్పష్టం చేశారు. నోటిఫై చేసిన ప్రాంతాల్లో తమిళం, కన్నడ మాట్లాడే ప్రజలు తమ మాతృభాషల్లోనే సచివాలయం, శాఖాధిపతులు, స్థానిక కార్యాలయాలతో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగించవచ్చని తెలిపారు. ఆ భాషలలోనే సమాధానాలు కూడా అందజేస్తామని పేర్కొన్నారు.

విద్యపై ఆందోళనలకు సమాధానం

కాసరగోడ్ జిల్లాలోని కన్నడ మాధ్యమ పాఠశాలలపై కర్ణాటక నేతలు వ్యక్తం చేసిన ఆందోళనలపై స్పందించిన సీఎం ‘మలయాళం మాతృభాష కాని విద్యార్థులు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాలల్లో అందుబాటులో ఉన్న భాషలను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు 9వ, 10వ తరగతులు లేదా ఇంటర్మీడియట్‌లో మలయాళం పరీక్షలు తప్పనిసరిగా రాయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

రాజ్యాంగానికి అనుగుణంగానే బిల్లు

కేరళ రాష్ట్ర భాషా విధానం అధికార భాషల చట్టం–1963తో పాటు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 346, 347లకు పూర్తిగా అనుగుణంగా ఉందని విజయన్ తెలిపారు. భారతదేశ వైవిధ్యాన్ని గౌరవించాలి, ఒకే చట్రంలోకి బలవంతంగా నెట్టకూడదని వ్యాఖ్యానించారు. కేరళ పాలన నమూనాను ప్రస్తావిస్తూ,

ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత మీదే కేరళ అభివృద్ధి నిలబడి ఉంది. ఫెడరల్ హక్కులను గుంజుకోవడాన్ని మా ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ప్రతి పౌరుడి భాషా గుర్తింపును సమానంగా కాపాడుతుంది’ అని సీఎం స్పష్టం చేశారు.

మలయాళ భాషా బిల్లుపై కర్ణాటక సీఎం వైఖరి ‘తప్పు’: మంత్రి పి. రాజీవ్

మలయాళ భాషా బిల్లు–2025పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకున్న వైఖరి తప్పుదారి పట్టించేదని కేరళ న్యాయ శాఖ మంత్రి పి. రాజీవ్ శనివారం అన్నారు. వార్తా ప్రతినిధులతో మాట్లాడుతూ సిద్ధరామయ్య అభిప్రాయాలు అధ్యక్షుడి ఆమోదం పొందని పాత మలయాళ భాషా బిల్లుపై ఆధారపడి ఉండవచ్చని రాజీవ్ వ్యాఖ్యానించారు.

కొత్త బిల్లులో స్పష్టమైన వివరణ

ప్రస్తుతం ప్రతిపాదించిన కొత్త బిల్లు ప్రకారం,

• తమిళం, కన్నడ భాషా అల్పసంఖ్యాకులు తమ మాతృభాషల్లోనే చదువుకునే అవకాశం ఉంది

• అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు కూడా ఆయా భాషలలోనే నిర్వహించవచ్చు

• మలయాళం చదవడం ఐచ్ఛికమే తప్ప, తప్పనిసరి కాదు అని మంత్రి వివరించారు.

• ఈ నిబంధనలు పాత బిల్లులో లేవు. అప్పట్లో వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కొత్త బిల్లును రూపొందించామని రాజీవ్ తెలిపారు.

కాంగ్రెస్‌పై విమర్శలు

కర్ణాటక సీఎం వ్యాఖ్యలు పాత బిల్లు ఆధారంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని, కాంగ్రెస్ నాయకత్వం సూచనల మేరకే ఆయన ఈ వైఖరి తీసుకుని ఉండవచ్చని రాజీవ్ విమర్శించారు. కొత్త బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో శబరిమల బంగారం అంశంపై నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభకు దూరంగా ఉన్నారని, అందువల్ల బిల్లుపై వారికి పూర్తి అవగాహన లేకపోయి ఉండవచ్చని ఆయన అన్నారు. రాష్ట్రాల మధ్య అనవసర వివాదాలు తలెత్తకూడదన్నదే కేరళ ప్రభుత్వ అభిప్రాయమని, కేరళ–కర్ణాటక రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని తాము కోరుకుంటున్నామని మంత్రి తెలిపారు. ముందుగా బిల్లును అధ్యయనం చేయాలి లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరాలి. అలా చేయకుండా విమర్శలు చేయడం అనవసర వివాదాలకు దారి తీస్తుందని వ్యాఖ్యానించారు.

మలయాళ భాషా బిల్లుపై సిద్ధరామయ్య అభ్యంతరాలు

కేరళ ప్రభుత్వం ప్రతిపాదించిన మలయాళ భాషా బిల్లు–2025పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్నడ మాధ్యమ పాఠశాలల్లో కూడా మలయాళాన్ని తప్పనిసరి మొదటి భాషగా చేయడం భాషా స్వేచ్ఛపై దాడి అని ఆయన అన్నారు. ఇది కాసరగోడ్ వంటి సరిహద్దు జిల్లాల ప్రజల జీవన వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం భాష విషయంలో బలవంతపు విధానాన్ని అనుసరిస్తోందని, ఇది భారత రాజ్యాంగ నైతికతకు విరుద్ధమని సిద్ధరామయ్య ఆరోపించారు. ఈ బిల్లు అమలులోకి వస్తే, కన్నడ మాట్లాడే అల్పసంఖ్యాకుల హక్కులు దెబ్బతింటాయని, ఇది బహుళ భాషా–బహుళ సంస్కృతి భారతదేశ ఆత్మకు వ్యతిరేకమని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, భాషా అల్పసంఖ్యాకుల హక్కులు, బహుళత్వ భావనను కాపాడేందుకు రాజ్యాంగం ఇచ్చిన ప్రతి హక్కును వినియోగించి కర్ణాటక దీనికి వ్యతిరేకంగా నిలబడుతుందని సిద్ధరామయ్య హెచ్చరించారు. ఈ అంశంపై కేరళ ముఖ్యమంత్రి విజయన్‌కు లేఖ రాసి, బిల్లుపై తన తీవ్ర ఆందోళనను అధికారికంగా తెలియజేశారు.

అయితే ఇటీవల కర్ణాటకలో పేదల ఇళ్ల కూల్చివేత విషయంలో కేరళ జోక్యం చేసుకుంది. తాజాగా కేరళ భాష బిల్లు విషయంలో కర్ణాటక జోక్యం చేసుకుని తమ రాజకీయ ప్రాధాన్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి.