
ఏపీ ప్రభుత్వాసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇటీవల వైద్య అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో అత్యవసర వైద్య సేవల కోసం రాష్ట్రంలోని వచ్చే నెలాఖరు నాటికి ప్రభుత్వాసుపత్రుల్లో త్వరలో 24 'క్రిటికల్ కేర్ బ్లాకులు' రాబోతున్నాయని, అలాగే వచ్చే సంవత్సరం 2026 ఆగస్టు 13 నాటికి మరో 11 సీసీబీలను వినియోగంలోనికి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోందని, వీటి ద్వారా అదనంగా 1,275 పడకలు అందుబాటులోనికి వస్తాయని, తెలుపుతూ వీటి నిర్మాణాల పురోగతిని అధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు వివరించారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రూ.600 కోట్ల వ్యయంతో చేపట్టిన వీటి నిర్మాణాలను దశల వారీగా వచ్చే ఏడాది ఆగస్టులోగా పూర్తిచేయాలని ఇప్పటికే అదికారులను మంత్రి ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
బోధనాసుపత్రుల నుంచి ఏరియా ఆసుపత్రుల వరకు..
కో విడ్-19 సమయంలో అత్యవసర వైద్యం రోగులకు అందడంలో సవాళ్లు ఎదురయ్యాయి. ఆ సమయంలో నాన్-కొవిడ్ కేసుల వారికి సరైన వైద్యం అందలేదు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పనరావృతం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 621 సీసీబీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం గుంటూరు మినహా 16 బోధనాసుపత్రులు, తెనాలి, అనకాపల్లి, హిందూపురం జిల్లా అసుపత్రులు (3), నరసరావుపేట, పాలకొండ, భీమవరం, రాయచోటి, చీరాల ఏరియా (5) ఏరియా ఆసుపత్రుల్లో వీటి నిర్మాణాలు జరుగుతున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు..
ఆగస్టు నాటికి నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రణాళికలు
ప్రస్తుతానికి నెల్లూరు, ఒంగోలు బోధనాసుపత్రుల్లోని సీసీబీల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. వచ్చే నెలాఖరు నాటికి కడప, కర్నూలు, తిరుపతి, హిందూపురం, అనంతపురం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, విశాఖ, శ్రీకాకుళం, విజయవాడ, విజయనగరం, 2026 మార్చి నాటికి తెనాలి జిల్లా ఆసుపత్రి, ఆగస్టు నాటికి చీరాల, పాడేరు, ఏలూరు, మచిలీపట్నం, పాలకొండ, నంధ్యాల, భీమవరం, నరసరావుపేట, రాయచోటి, కాకినాడ ఆసుపత్రుల్లో నిర్మాణాలు పూర్తవుతాయని అన్నారు.
ఒక్కో 50 పడకల సీసీబీ కోసం రూ.23.75 కోట్లు వ్యయం
50 పడకలతో ఏర్పాటయ్యే 22 సీసీబీల్లో ఒక్కొక్క దానికి (పరికరాలు, యంత్రాలతో కలిపి) రూ.23.75 కోట్లు చొప్పున వ్యయం చేస్తున్నామన్నారు. 75 పడకలతో ఉన్న నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రిలో సీసీబీ నిర్మాణానికి రూ.36.35 కోట్లు, వంద పడకలతో తెనాలి జిల్లా ఆసుపత్రిలో రూ.44.50 కోట్లతో సీసీబీ ఏర్పాటు కాబోతో౦దని, ప్రతి ఆసుపత్రిలో సుమారు రూ.7 కోట్లను పరికరాలు, యంత్రాల కోసం వ్యయం చేస్తున్నామన్నారు.
ఐసీయూ, మినీ ఐసీయూ, ఇతర సౌకర్యాలు
ప్రతి 50 పడకల సీసీబీలో పది పడకలతో ఒక ఐసీయూ, ఆరు పడకలతో మినీ ఐసీయూ (స్టెప్ డౌన్), 24 ఐసోలేషన్ పడకలతో పాటు విడిగా డయాలసిస్ పడకలు, మెటర్నటీ పడకలు, క్యాజువాల్టీ వార్డు అందుబాటులోనికి వస్తుంది. గుండె, శ్వాసకోశ సంబంధిత కేసులు, పాయిజన్ కేసులు, డయాలసిస్, మెటర్నల్ అoడ్ చై ల్డ్ హెల్త్ ఇతర కేసులు ఇక్కడ చూస్తారని వైద్య అధికారులు సత్యకుమార్ యాదవ్ కు వివరించారు.
అసుపత్రుల పనితీరుపై సచివాలయంలో మంత్రి సుదీర్ఘ సమీక్ష
అంతకుముందు జరిగిన చర్చల్లో ప్రభుత్వ వైద్యులు రోజుకు ఎంత మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు? విధుల్లో అలక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు ఉండాలి. బాగా పనిచేసే వారిని ప్రోత్సహించే విధానాన్ని ప్రవేశపెట్టాలంటూ ఉన్నతాధికారులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు.
వైద్యులు ప్రతిరోజూ ఎంతమంది రోగులకు వైద్యం అందిస్తున్నారో పరిశీలించి మదింపు చేయాలని, రోగులకు సేవలు అందించడంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వైద్యులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది విషయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో వెనుకాడవద్దని స్పష్టంచేశారు. రాష్ట్ర సచివాలయంలో సుమారు 4 గంటలపాటు ప్రభుత్వాసుపత్రులు, వైద్యుల పనితీరుపై ఉన్నతాధికారులతో ఈ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అసుపత్రుల్లో వైద్యులు ఉండడంలేదని తన దృష్టికి నిత్యం వస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ పరిస్థితులు బోధనాసుపత్రులు, జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఉన్నాయన్నారు. ఇలాగైతే రోగులకు మెరుగైన వైద్య సేవలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. వైద్యులు ప్రతిరోజూ విధుల నిర్వహణలో భాగంగా ఎంతమంది రోగులను ఓపీ చూస్తున్నారో గమనించి నివేదికలు అందచేయాలని ఆదేశించారు.
ఉత్తమ వైద్యులు, సిబ్బందిని గుర్తించి ప్రోత్సహించాలి
విధుల నిర్వహణలో స్ఫూర్తిగా నిలిచే వైద్యులు, ఇతర సిబ్బందిని నెలవారీగా గుర్తించి ప్రోత్సహించాలన్నారు. ముఖ ఆధారిత హాజరు(ఎఫ్ఆర్ యస్) విధానం అమలు చేస్తుండగా కొందరు తప్పుడు పద్ధతులు అనుసరించి విధులకు దూరంగా ఉంటున్నారన్నారు. సంజాయిషీ నోటీసులు జారీచేస్తున్నా ఇంకా మార్పు కనిపించడంలేదన్నారు. బాగా పనిచేసే వారిని గుర్తిస్తూ, పని చేయని వారిపై చర్యలు తీసుకోవడంలో ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు.
బోధనాసుపత్రులో అడ్మినిస్ట్రేటర్ల పనితీరు సంతృప్తికరంగా లేదు
భోధనాసుపత్రుల్లో పనిచేసే అడ్మినిస్ట్రేటర్ల పనితీరు సంతృప్తికరంగా లేదని మంత్రి శ్రీ సత్యకుమార్ వెల్లడించారు. ఆసుపత్రుల్లోనే ఉండి రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన వీరి విధుల నిర్వహణ సక్రమంగా లేదన్నారు. వీరి రోజువారి పనితీరును కూడా పరిశీలించాలన్నారు. ప్రస్తుతం వైద్యులుగా పనిచేస్తూ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు చేసిన వాళ్లెంత మంది ఉన్నారని అధికారులను అడిగారు. బోధనాసుపత్రులు సూపరింటెండెంట్లు ఇతర కీలక హోదాల్లో ఉన్న జాబ్ చార్ట్‌ను కూడా తరచూ పరిశీలించాలన్నారు.
ఐపి కోసం చేరేవారికి ఓపీ కింద వివరాల నమోదు ఎందుకు?
అసుపత్రుల్లో ఐపి కింద చేరే వారు ఓపీ కింద కూడా పేర్లు నమోదు చేసుకోవడం ఎందుకు సమయం వృధా కాదా? అని ప్రశ్నించారు. దీనిపై పరిశీలన జరిపి, సరైన నిర్ణయాన్ని తీసుకోవాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ అభా ఐడీల ద్వారా రోగులకు చికిత్స జరిగేలా చూడాలని పేర్కొన్నారు. దీనివల్ల వైద్య సేవల తీరుపై మరింత స్పష్టత వస్తుందన్నారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే క్యాన్సర్ చికిత్స వివరాలు రిజిస్ట్రీలో నమోదు కావాలి
క్యాన్సర్ వ్యాధులకు అందించే చికిత్స వివరాలు సైతం ప్రైవేటు ఆసుపత్రులు నోటిఫైబుల్ రిజిస్ట్రీ ద్వారా వెల్లడించాలన్నారు. అయితే ఇది ఆచరణలో జరగడంలేదన్నారు. ఈ విషయంలోనూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు సీఈఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
