Let's talk: editor@tmv.in
ఏ చట్టమూ ప్రజలకు భారం కాకూడదు: ప్రధాని మోడీ

ఏ చట్టమూ ప్రజలకు భారం కాకూడదు: ప్రధాని మోడీ

Pinjari Chand
10 డిసెంబర్, 2025

దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వంలో చట్టాలు, నియమాలు పౌరులపై భారంగా మారకుండా చూడాలని, సంస్కరణలు వేగంగా, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాయని ఆయన అన్నారు. మంగళవారం పార్లమెంట్ భవనంలో నిర్వహించిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం ఎప్పుడూ పౌరుల సౌకర్యం కోసం ఉండాలి. ఎవరికీ ఇబ్బంది కలిగేలా, అవరోధాలుగా మారేలా ఉండకూడదంటూ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మార్గనిర్దేశం చేశారని, ఇది ప్రభుత్వ ‘రీఫార్మ్ ఎక్స్‌ప్రెస్’। దశ అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్ కదలడం ప్రారంభించిందని, ఇది ఆగదు. ఈ సంస్కరణ ప్రతి పౌరుడి జీవితాన్ని మార్చడమే. మనం సంస్కరణల గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది దానిని ఆర్థిక సంస్కరణగా భావిస్తారు, మరి కొంతమంది దానిని రాజకీయ సంస్కరణగా, పరిపాలనా సంస్కరణగా లేదా సాంస్కృతిక సంస్కరణగా భావిస్తారు. సంస్కరణ అంటే ప్రతి పౌరుడి జీవితంలో మెరుగుదల అని తెలిపారు.

ప్రజల జీవన ప్రమాణాలే లక్ష్యం

సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను చురుకుగా పంచుకోవాలని మోడీ ఎంపీలను కోరినట్లు ఎన్డీయే వర్గాలు తెలిపాయి, తద్వారా సంస్కరణలు ప్రతి ఇంటికి చేరుతాయి. రోజువారీ కష్టాలను తొలగిస్తుంది.ప్రధాని చాలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ఏ చట్టంలోనైనా ప్రజలకు ఇబ్బంది కలిగించే నిబంధన ఉండకూడదు. నియమాలు ప్రజల్ని వేధించడానికి కాదు, వ్యవస్థను మెరుగుపరచడానికి మాత్రమే. ఈ దిశలో కేంద్రం, రాష్ట్రాలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు అన్ని కలిసి పనిచేయాలి. ప్రతి నిబంధన వ్యవస్థాభివృద్ధి కోసం ఉండాలి గానీ, ప్రజలను వేధించడానికి కాదని మోడీ స్పష్టం చేసినట్లు తెలిపారు. దేశంలో 30–40 పేజీల ఫారమ్‌లు, అనవసరమైన కాగితాల సంస్కృతిని పూర్తిగా ముగించాలని ప్రధాని సూచించినట్లు సమాచారం. ప్రజలు ఇచ్చే ప్రతి డేటాను పదే పదే అడగకుండా డోర్‌స్టెప్ సర్వీసులు అందించే విధంగా వ్యవస్థను మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.

స్వీయ ధృవీకరణపై విశ్వాసం

పౌరులపై ప్రభుత్వం ఉంచిన విశ్వాసం వలన 10 ఏళ్లుగా సెల్ఫ్ సర్టిఫికేషన్ పద్ధతి ఎక్కడా దుర్వినియోగం కాలేదని మోదీ గుర్తుచేశారు. జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం రెండూ తన ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలని ప్రధాని స్పష్టం చేశారు.

బీహార్ విజయ వేడుక

సమావేశ ప్రారంభంలో ఎన్డీయే బీహార్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని మోడీకి ఎంపీలు అభినందనలు తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా తదితరులు హాజరయ్యారు. జేడీ(యూ) నేత సంజయ్ ఝా, రాష్ట్రీయ లోక్ మోర్చా అధినేత ఉపేంద్ర కుశ్వాహా కలిసి మోడీకి గజమాలతో సత్కారం చేశారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 శాసనసభ స్థానాలకు గాను 202 సీట్లు గెలిచింది. అందులో జేడీయూ 85, బీజేపీ 89, ఎల్జేపీ(రామ్ విలాస్)19, హిందుస్థాని అవామ్ మోర్చా 5, రాష్ట్రీయ లోక్ మోర్చా 4 స్థానాలను గెలుచుకుంది. ఈ విజయంతో నితీశ్ కుమార్ 10వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.