
ఏ ఐ యుగంలో నిజమైన సంక్షోభం: చేతి నైపుణ్యాల కొరతను బయటపెట్టిన ఆనంద్ మహీంద్రా హెచ్చరిక
కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని మార్చేస్తుందనే చర్చలు, ఉద్యోగాలను హరిస్తుందనే భయాలు, టెక్ రంగంలో విప్లవాలు ఇవన్నీ నేటి ప్రపంచంలో ప్రధాన చర్చలుగా అయిపోయాయి. ఐటీ ఉద్యోగాలు తగ్గుతాయా? డెస్క్ జాబ్స్‌కి భవిష్యత్తు ఉందా? కోడింగ్ నేర్చుకోకపోతే అవకాశాలు తగ్గుతాయా? వంటి ప్రశ్నలు యువతను వెంటాడుతున్నాయి. అయితే ఈ చర్చల మధ్య, ఆనంద్ మహీంద్రా ఒక కీలకమైన, వాస్తవాన్ని ముందుకు తెచ్చారు: ప్రపంచానికి అసలు కొరత వైట్ కాలర్ ఉద్యోగులది కాదు; వృత్తి నైపుణ్యాలతో పనిచేసే వారిదే అని ఆయన ట్వీట్ చేశారు.
ఆయన ఫోర్డ్ సంస్థ CEO జిమ్ ఫార్లే మాటలను కోట్ చేస్తూ, అమెరికాలోనే వేల సంఖ్యలో మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చూపించారు. వాటిలో అనేక పోస్టులు $120,000 వరకు వార్షిక జీతం ఇస్తున్నా కూడా, అర్హులైన వ్యక్తులు దొరకడం లేదట. ఇది కేవలం అమెరికా సమస్య కాదు; ఇది విద్యాశాఖలు, ఉద్యోగ విధానాలు, మరియు సమాజపు విలువలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోతైన లోపాన్ని ప్రతిబింబిస్తుంది.
భారతదేశ దృశ్యం ఇంకా గందరగోళంగా ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇంజనీరింగ్ పట్టాలు పొందుతారు. కానీ వారిలో ఎంతమంది నిజంగా ఇంజనీరింగ్ నైపుణ్యాలపై, మాన్యువల్ టెక్నికల్ పనులపై ఆసక్తి చూపుతారు? డిగ్రీలు మాత్రమే ఉన్నాయి కాని చేతి నైపుణ్యాలు లేవు అనే పరిస్థితి ఈరోజుల్లో మరింత తీవ్రమవుతోంది. ఫలితంగా, సర్వీస్ సెంటర్లలో, తయారీ కేంద్రాల్లో, ఫ్యాక్టరీల్లో, కొత్తగా పుంజుకుంటున్న సాంప్రదాయేతర ఇందన రంగం, వాహనరంగాల్లో పనిచేసే నిపుణుల కొరత పెరుగుతోంది.
చేతితో పనిచేసేవి తక్కువ స్థాయి పనులని సమాజంలో ఒక పెద్ద అపోహ వుంది కానీ ఈ వృత్తులే ఆర్థిక వ్యవస్థను నడిపిస్తాయనేది వాస్తవం. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్, వెల్డర్, టెక్నీషియన్—ఈ వృత్తులు ఒక్కరోజు నిలిచిపోతే, మొత్తం సదుపాయాల వ్యవస్థే కుప్పకూలుతుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కొరత తక్షణ ప్రభావం చూపకపోవచ్చు; కానీ మెకానిక్ ల కొరత మాత్రం రోజువారీ జీవన నడకనే నిలిపేస్తుంది. ఇదే మౌలిక సత్యాన్ని మహీంద్రా మరోసారి గుర్తు చేశారు.
కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందుతున్న కొద్దీ, ఆఫీస్ పనుల్లో చాలా భాగం ఆటోమేట్ అవుతోంది. కంప్యూటర్ ముందు కూర్చొని టైప్ చేసే పనులను యంత్రాలు త్వరగా నేర్చుకుంటున్నాయి. కానీ మనుషులు మాత్రమే సున్నితమైన నైపుణ్యం, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకునే సామర్థ్యం, పరికరాలతో ఏకీకృతంగా పనిచేసే నైపుణ్యం కలిసి చేసే పనులు యంత్రాలకు సాధ్యం కాదు. ఒక ఇంజిన్ శబ్దాన్ని విని లోపం గుర్తించడం, ఒక వైర్ సడెన్‌గా వేడెక్కుతుందేమో అంచనా వేయడం, ఒక యంత్రం ‘వైబ్రేషన్’ చూసి సమస్యను పట్టుకోవడం—ఇవి మానవ అనుభవం మాత్రమే నేర్పుతాయి.
ఈ నేపథ్యంలో, భారతదేశంలో వృత్తిపరమైన విద్యకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ITIలు, పాలిటెక్నిక్స్, స్కిల్ మిషన్ సంస్థలు పాత పద్ధతుల్లోనే కొనసాగుతుండటం పెద్ద లోపంగా నిలుస్తోంది. పరిశ్రమలు మారుతున్నాయి, యంత్రాలు మారుతున్నాయి, టెక్నాలజీలు వేగంగా మారుతున్నాయి కానీ వృత్తిపరమైన శిక్షణ మాత్రం చాలాచోట్ల దశాబ్దం వెనుకబడి ఉంది. యువత ఈ ఉద్యోగాలను ‘రెండో రకం’గా చూసే దృక్పథాన్ని మార్చటం అత్యవసరం. మంచి జీతాలు, ఎదుగుదలకు అవకాశాలు, సామాజిక గౌరవం ఈ మూడు అంశాలను ప్రభుత్వం మరియు పరిశ్రమలు కలసి హామీ ఇవ్వాలి.
మహీంద్రా సందేశం మనకు ఒక ముఖ్యమైన ఆలోచనను అందిస్తుంది: AI రాకతో ఉద్యోగాలు పోవడం కాదు; మన సమాజం నైపుణ్యాల విలువను తగ్గించుకోవడం వల్లే ఉద్యోగ ఖాళీలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో అత్యంత విలువైన మానవ ఆస్తి డిగ్రీలు కాదు నైపుణ్యాలే. చేతితో పనిచేయగల సామర్థ్యం, నేర్చుకున్నది పనిగా మార్చగల శిక్షణ, వాస్తవ ప్రపంచంలో సమస్యలను పరిష్కరించే అనుభవం ఇవి రేపటి ప్రపంచంలో బంగారంలా మారబోతాయి.
ఇప్పుడు మనముందున్న సవాలు- AI మానవ భవిష్యత్తుకు ప్రమాదమా ? లేదా చేతులతో పనిచేసే మనుషుల కొరతే నిజమైన ప్రమాదమా? దేశం ముందుకెళ్లాలంటే, యంత్రాలను నడిపించే నిపుణులు తప్పనిసరి. లేకపోతే, ఎన్ని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు వచ్చినా, ఎన్ని డిజిటల్ సంస్కరణలు వచ్చినా, ఆర్థిక వ్యవస్థ ముందుకు కదలదని మహీంద్రా మాటలు సూచిస్తున్నాయి
