
ఏళ్ళ నాటి హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు
కృష్ణా జిల్లాలో సంవత్సరాల క్రితం జరిగిన ఒక హత్య కేసులో న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. పాత కక్షల నేపథ్యంలో జరిగిన ఈ ఘోర ఘటనలో నిందితులుగా తేలిన ఏడుగురు వ్యక్తులకు జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో తుది తీర్పును వెల్లడించిన న్యాయమూర్తి జి. గోపి ప్రధాన శిక్షతో పాటు, దోషులుగా తేలిన ప్రతి ఒక్కరికీ రూ. 2,000 చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించారు. ఈ తీర్పుతో కాగిత రామ్మోహనరావు హత్య కేసులో న్యాయం నెరవేరినట్లైంది.
ఘటన వివరాలు
మచిలీపట్నం మండలం గొల్లగూడేనికి చెందిన రామ్మోహనరావుకు అదే గ్రామంలోని కొందరు వ్యక్తులతో దీర్ఘకాలంగా విరోధాలు ఉండేవి.ఈ క్రమంలో 2013 ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి బాధితుడు రామ్మోహనరావు తన పొలంలో గడ్డివాము వద్ద ఒంటరిగా ఉండడం గమనించిన నిందితులు అతడిపై కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. అనంతరం మృతదేహాన్ని బుద్దలపాలెం గొల్లగూడెం గ్రామంలోని ఒక దేవాలయం వద్దకు లాక్కెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు తొమ్మిది మందిని నేరస్థులుగా నిర్దారించి మచిలీపట్నం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఏ. పల్లాపురాజు పర్యవేక్షణలో దర్యాప్తును ప్రారంభించారు.
సుదీర్ఘంగా సాగిన విచారణలో భాగంగా నిందితుల్లో ఇద్దరు (శొంఠి వీరబాబు, కాగిత ఆంజనేయులు) మృతి చెందారు. మిగిలిన ఏడుగురు – శొంఠి పెదవైడేశ్వరరావు, బొర్రా శ్రీనివాసరావు, బొర్రా స్వయంకృష్ణ, కాగిత సోమయ్య, శొంఠి వీర వెంకటేశ్వరరావు, శొంఠి వీరాంజనేయులు, శొంఠి ముసలయ్య – నేరం చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఐపీసీ ఐపీసీ సెక్షన్లు 147, 148, 302 రీడ్వి 149 కింద వారిపై నేరం రుజువు కావడంతో కోర్టు వారికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది.
