
ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
ఏలూరు జిల్లా భీమడోలు మండలం సురప్పగూడెం వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా వెళ్తున్న మోటార్‌సైకిల్‌ను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
ద్వారకా తిరుమల గ్రామానికి చెందిన సయ్యద్ రఫీ (19), కొయ్యగూర శ్రీరామ్ (22)లతో పాటు తిమ్మాపురం గ్రామానికి చెందిన మానరాజు చరణ్ కుమార్ (26) శనివారం తెల్లవారుజామున బైక్‌పై కొవ్వూరు-గుండుగొలను జాతీయ రహదారి మీదుగా ఏలూరు వైపు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బైక్ సురప్పగూడెం శివారుకు చేరుకోగానే, వెనుక నుంచి వచ్చిన ఒక గుర్తు తెలియని వాహనం వీరిని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
హిట్ అండ్ రన్ కేసుగా గుర్తింపు
సమాచారం అందుకున్న వెంటనే భీమడోలు ఇన్‌స్పెక్టర్ జోసెఫ్ విల్సన్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. "ప్రాథమిక విచారణ ప్రకారం ఇది హిట్-అండ్-రన్ ఘటనగా భావిస్తున్నాం. యువకులను ఢీకొట్టిన వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. ఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాలు, సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం అని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దారుణ ఘటనపై రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఒకే ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందడంతో ద్వారకా తిరుమల, తిమ్మాపురం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికి అందొచ్చిన కుమారులు కళ్లముందే విగతజీవులుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. జాతీయ రహదారిపై రక్షణ చర్యలు చేపట్టాలని, పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
