
ఏలూరు జిల్లాలో ఎరువుల కొరత లేదు: మంత్రి పార్థసారథి
జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. చాట్రాయి మండలం నరసింహరావుపాలెంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల గోడౌన్‌ను, ఎరువుల దుకాణాలను మంత్రి మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్లలో ఉన్న ఎరువుల నిల్వలు, రిజిస్టర్లను మంత్రి పరిశీలించారు. అక్కడకు వచ్చిన రైతులను వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. చాట్రాయి మండలం నరసింహరావుపాలెంలో రైతులకు అవసరాలకు సరిపడిన ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఇంకా అవసరమైతే ఎరువులను అందుబాటులోకి తీసుకువస్తామని, ఎరువుల విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు. కొందరు కావాలని ఎరువుల కొరత ఉందని వదంతులను సృష్టిస్తున్నారని, రైతులు వాటిని నమ్మవద్దన్నారు.
రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని, రైతుల సమస్యలను ముందుగానే తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోమని వ్యవసాయ, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించడం జరిగిందని, అధికారులు కూడా 10 రోజులకు సరిపడా ఎరువుల నిల్వలను బఫర్ స్టాక్‌గా నిల్వ ఉంచుతూ, ఎక్కడైనా ఎరువుల కొరతను ముందుగానే గుర్తించి అక్కడకు వెంటనే ఎరువులను సరఫరా చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఎరువులను మంత్రి స్వయంగా రైతులకు అందించారు. మంత్రి వెంట వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ భాషా, రెవిన్యూ, వ్యవసాయ శాఖాధికారులు ఉన్నారు.
