
ఏలూరులో నవజాత శిశువుల అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు
పసికందులనే పెట్టుబడిగా మార్చుకుని అక్రమంగా విక్రయిస్తున్న ఒక నెట్‌వర్క్‌ను ఏలూరు జిల్లా పోలీసులు ఛేదించారు. వ్యవస్థీకృత పద్ధతిలో సాగుతున్న ఈ శిశువుల అక్రమ రవాణా ఉదంతం జనన నమోదు రికార్డుల పరిశీలనలో వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. నకిలీ పత్రాలతో జనన ధృవీకరణ పత్రాలు సృష్టించి ఏకంగా ఆధార్ కార్డులు కూడా పొందుతున్న ఈ ముఠా అక్రమాలను పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టారు.
జనన, మరణ రికార్డుల ధృవీకరణ సమయంలో కొన్ని ఎంట్రీలు అధికారులకు అనుమానం కలిగించాయి. ముఖ్యంగా ఏలూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పుట్టినట్లు నమోదైన కొన్ని శిశువుల వివరాలకు సరైన ఆధారాలు లేకపోవడంతో జిల్లా బాలల సంరక్షణ అధికారి సూర్య చక్రవేణి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే శిశువుల క్రయవిక్రయాల వెనుక ఉన్న అసలు దందా వెలుగు చూసింది.
లక్షల్లో బేరాలు.. నకిలీ పత్రాల సృష్టి
ఈ మేరకు ఏలూరు ఎస్డీపీఓ డి. శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు రెండు ప్రధాన విక్రయ ఘటనలను వెలుగులోకి వచ్చాయని మొదటిది ముదినేపల్లి మండలానికి చెందిన ఓ దంపతులకు సంతానం కలగకపోవడంతో పలుమార్లు ఐవీఎఫ్ చికిత్సలు చేయించుకున్నారు. ఫలితం దక్కకపోవడంతో మధ్యవర్తులను ఆశ్రయించారు. 2024 డిసెంబర్ 1న సుమారు రూ.3 లక్షలు చెల్లించి ఒక ఆడ శిశువును కొనుగోలు చేశారు. అయితే ఆ బిడ్డ తమకు పుట్టినట్లే లోకానికి నమ్మించేందుకు సదరు దంపతులు గర్భం దాల్చినట్లు నాటకమాడారు. అనంతరం రైలు ప్రయాణంలో శిశువు పత్రాలు పోయాయంటూ ఒక కట్టుకథ అల్లి అధికారులను తప్పుదారి పట్టించారు. మధ్యవర్తుల సాయంతో పంచాయతీ కార్యాలయం నుంచి జనన ధృవీకరణ పత్రం సంపాదించి దాని ఆధారంగా ఆధార్ కార్డు కూడా పొందినట్లు పోలీసులు గుర్తించారు.
మరో ఘటనలో సెప్టెంబర్ 29, 2024న ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించిన మగ శిశువును కేవలం రూ.30 వేలకు విక్రయించినట్లు తేలింది. ఈ వ్యవహారంలో సదరు ఆసుపత్రిలో పనిచేసే ఒక నర్సు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో దంపతులతో సహా ఆరుగురిని నిందితులుగా గుర్తించి కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న మహిళపై గతంలోనూ పలు జిల్లాల్లో శిశు అక్రమ రవాణా కేసులు ఉన్నట్లు తేలడంతో ఆమెను అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.
ఈ ముఠా నెట్‌వర్క్ కేవలం ఈ రెండు ఘటనలకే పరిమితం కాలేదని మరిన్ని విక్రయాలు జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత జువెనైల్ జస్టిస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ప్రైవేట్ ఆసుపత్రుల పాత్ర, మధ్యవర్తుల ముఠా, పంచాయతీ కార్యాలయాల్లో పత్రాల జారీ తీరుపై ప్రత్యేక బృందాలు లోతైన దర్యాప్తును కొనసాగిస్తున్నాయి.
