Let's talk: editor@tmv.in
ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైయస్‌ఆర్‌సీపీ సమరభేరి
ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైయస్‌ఆర్‌సీపీ సమరభేరి
ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైయస్‌ఆర్‌సీపీ సమరభేరి

ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైయస్‌ఆర్‌సీపీ సమరభేరి

Dantu Vijaya Lakshmi Prasanna
9 ఏప్రిల్, 2026

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ‘కొత్త పలుకు’ శీర్షికతో వైయస్‌ఆర్‌సీపీ నాయకులను, వారి కుటుంబ సభ్యులను, మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపాయి. రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు మిన్నంటాయి. ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముట్టడికి పార్టీ శ్రేణులు ప్రయత్నించగా, పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మహిళలపై పైశాచిక వ్యాఖ్యలు: నేతల ఆగ్రహం

వైయస్‌ఆర్‌సీపీ నేతల భార్యలను, మహిళా కార్యకర్తలను నీచమైన భాషతో దూషించడాన్ని పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. దేశ చరిత్రలో ఏ మీడియా సంస్థ చేయనంత నికృష్టమైన వ్యాఖ్యలను రాధాకృష్ణ చేశారని మండిపడ్డారు. రాధాకృష్ణ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

జిల్లాల వారీగా నిరసనల పర్వం

అనంతపురంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, జడ్పీ చైర్మన్ గిరిజమ్మ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అరెస్టులకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది.

కర్నూలు జిల్లా (ఆలూరు)లో ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన జరిగింది. అమరావతి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే రాధాకృష్ణ, టీవీ5 బి.ఆర్. నాయుడు చంద్రబాబుతో కలిసి కుట్రలు చేస్తున్నారని విరుపాక్షి ధ్వజమెత్తారు. వైయస్ జగన్ చేపట్టిన 'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి రాతలు రాస్తున్నారని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్ భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు బారికేడ్లు వేసి అడ్డుకున్నా, కార్యకర్తలు రాధాకృష్ణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

పశ్చిమగోదావరి జిలా తణుకు నరేంద్ర సెంటర్‌లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాజకీయ విమర్శలు మాని, నేతల కుటుంబ సభ్యులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడటం రాధాకృష్ణ ‘పైశాచిక ఆనందానికి’ నిదర్శనమని వారు పేర్కొన్నారు.

విశాఖపట్టణంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, కేకే రాజు నేతృత్వంలో విశాఖలో శాంతియుత ప్రదర్శన జరిగింది. నిరసన కోసం వేసిన టెంట్లను పోలీసులు తొలగించడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.

గృహ నిర్బంధాలు - పోలీసుల తీరుపై మండిపాటు

కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నాగరాజు పేటలోని ఆంధ్రజ్యోతి కార్యాలయానికి ఆయన వెళ్లకుండా ఇంటి వద్దే భారీగా బలగాలను మోహరించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని అంజాద్ భాష విమర్శించారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాధాకృష్ణ మీడియా ముసుగులో ఉన్న రాజకీయ ఏజెంట్ అని, మహిళలను కించపరిచే హక్కు ఆయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ నిరసనల్లో వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఒకటే డిమాండ్ చేశారు. "పచ్చ మీడియా తన పైశాచికత్వాన్ని ఆపాలి. మహిళా లోకానికి రాధాకృష్ణ క్షమాపణ చెప్పే వరకు ఈ పోరాటం ఆగదు." ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తోందని పార్టీ శ్రేణులు ఆరోపించాయి.

ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైయస్‌ఆర్‌సీపీ సమరభేరి - Tholi Paluku