Let's talk: editor@tmv.in
ఏపీ వైద్యారోగ్య శాఖలో 538 ఉద్యోగాలు

ఏపీ వైద్యారోగ్య శాఖలో 538 ఉద్యోగాలు

Shaik Mohammad Shaffee
15 సెప్టెంబర్, 2025

రాష్ట్రంలోని వైద్య ఉద్యోగార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 538 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీఎంఎస్ఆర్బీ) ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 3వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ఇతర ప్రభుత్వ వైద్య సంస్థల్లో నియమిస్తారు.

విద్యార్హతల విషయానికి వస్తే, అభ్యర్థులు తప్పనిసరిగా ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు ఓసీ అభ్యర్థులకు రూ.1,000 కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు,ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.750గా నిర్ణయించారు.

ఈ నియామకానికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. విద్యార్హతలో సాధించిన మార్కులు, అనుభవం (వర్తిస్తే), ఇతర రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తారు. మొత్తం 100 మార్కులకు గాను విద్యార్హతలో సాధించిన మార్కులకు 75 శాతం వెయిటేజీ ఉంటుంది. మిగిలిన మార్కులు అనుభవం, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం వంటి వాటికి కేటాయిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.61,960 నుండి రూ.1,51,370 వరకు జీతం లభిస్తుంది. అభ్యర్థులు మరిన్ని పూర్తి వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ apchfw.ap.gov.inను సందర్శించవచ్చు.

ఏపీ వైద్యారోగ్య శాఖలో 538 ఉద్యోగాలు - Tholi Paluku