Let's talk: editor@tmv.in
ఏపీ రాజకీయాల్లో బాలకృష్ణ, చిరంజీవి వివాదం

ఏపీ రాజకీయాల్లో బాలకృష్ణ, చిరంజీవి వివాదం

FL - SUNL
27 సెప్టెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇప్పటి వరకు కూటమి వర్సెస్ వైసీపీగా ఉన్న రాజకీయాలు బాలకృష్ణ వర్సెస్ చిరంజీవిగా మారాయి. మరోవైపు ఈ వివాదంలోకి ఉపముఖ్యమంత్రి, చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ ను లాగేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు కాస్తా సినీ పరిశ్రమతో ముడిపడి, బాలకృష్ణ-చిరంజీవి మధ్య వివాదంగా మారాయి. గురువారం శాసనసభ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం చిరంజీవి జగన్‌ను కలిశారని, ఆయన గట్టిగా అడిగారని వ్యాఖ్యానించారు. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ, "చిరంజీవి గట్టిగా అడగలేదు, ఆ వ్యాఖ్యలు అబద్ధం" అని, జగన్‌ను "సైకో" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, రాజకీయ-సినీ వర్గాల్లో దుమారం రేపాయి.

విదేశాల నుంచి స్పందించిన చిరంజీవి

ఈ వ్యాఖ్యలపై విదేశీ పర్యటనలో ఉన్న చిరంజీవి పత్రికా ప్రకటన ద్వారా స్పందించారు. "నేను ఎవరితోనైనా గౌరవంగా మాట్లాడతాను. సినీ పరిశ్రమ సమస్యలపై నిర్మాతలు, దర్శకుల సూచనతో జగన్‌ను కలిశాను. బాలకృష్ణను కూడా సంప్రదించాను, కానీ ఆయన అందుబాటులో లేరు" అని వివరించారు. టికెట్ రేట్ల పెంపు వల్ల ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి చిత్రాలకు లాభం చేకూరిందని పేర్కొన్నారు. చిరంజీవి స్పందన సోషల్ మీడియాలో మద్దతు పొందగా, ఈ వివాదం టీడీపీ-వైసీపీ మధ్య ఉద్రిక్తతను పెంచింది.

బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్

బాలకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ అభిమానులు హైదరాబాద్, విజయవాడలో నిరసనలు చేపట్టారు. #BoycottBalakrishna, #BalayyaApologize హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో బాలకృష్ణ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ, "బాలయ్య మాటలు అనుచితం" అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. వైసీపీ నాయకులు ఈ వ్యాఖ్యలను సినీ పరిశ్రమకు అవమానంగా అభివర్ణించారు.

పవన్ పై యాంకర్ శ్యామల సెటైర్లు

ఈ వివాదంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, చిరంజీవి సోదరుడు, వైరల్ ఫీవర్ కారణంగా స్పందించలేదు. ఈ సందర్భంగా వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, "పవన్ గారి ఫీవర్ బాలయ్య మాటలతో మరింత పెరిగిపోతుందేమో" అని సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ కాగా, జనసేన నాయకులు పవన్ త్వరలో స్పందిస్తారని తెలిపారు. ఈ వివాదం రాజకీయ, సినీ వర్గాలను విభజించి, ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

ఏపీ రాజకీయాల్లో బాలకృష్ణ, చిరంజీవి వివాదం - Tholi Paluku