Let's talk: editor@tmv.in
ఏపీ మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల

ఏపీ మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల

Shaik Mohammad Shaffee
16 సెప్టెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగార్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2025 తుది ఎంపిక జాబితాను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షల తుది జాబితా విడుదల కావడంతో వేలాది మంది నిరుద్యోగుల కల సాకారమైంది.

ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in/లో అందుబాటులో ఉంది. అభ్యర్థులు తమ హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి తమ ఫలితాలను చూసుకోవచ్చు. అంతేకాకుండా, జిల్లా విద్యాశాఖ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల్లో కూడా తుది జాబితాను ప్రదర్శనకు ఉంచారు. మొత్తం 16,347 పోస్టులకు గాను, కొన్ని రిజర్వ్డ్ కేటగిరీల్లో అర్హులైన అభ్యర్థులు లభించకపోవడంతో దాదాపు 15,941 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. ఎంపికైన వారిలో 49 శాతం మంది మహిళలు ఉండటం విశేషం.

రాష్ట్రంలో ఏప్రిల్ 20న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేయగా, మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 3,36,300 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు రెండు విడతల్లో నిర్వహించారు. జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఆగస్టు 1న తుది కీని విడుదల చేశారు.

టెట్, డీఎస్సీ మార్కులకు వెయిటేజీ

మెగా డీఎస్సీలో అభ్యర్థుల ఎంపికకు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) మార్కులకు 20 శాతం, డీఎస్సీ మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి తుది మెరిట్ జాబితాలను రూపొందించారు. దీని తర్వాత ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఏడు దశల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. అర్హులైన అభ్యర్థులందరి ధ్రువ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది ఎంపిక జాబితాను సిద్ధం చేసి విడుదల చేశారు.

ఈనెల 19న నియామక పత్రాలు

మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 19న నియామక పత్రాలు అందజేస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. తుది జాబితాలో ఎంపికైన వారిలో 7,955 మహిళలు, 7,986 పురుష అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. వీరికి 19న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరుల సమక్షంలో నియామక పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు జిల్లాల వారీగా పోస్టింగ్లు కేటాయించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

పేరు లేని వారు నిరుత్సాహపడొద్దు: లోకేష్

ఏపీ మెగా డీఎస్సీలో అర్హత పొందిన అభ్యర్థులందరికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన మెగా డీఎస్సీ వాగ్దానం నెరవేరింది. ఈ మైలురాయి నా బాధ్యతను మరింత పెంచింది. ఈసారి జాబితాలో అవకాశం రాని అభ్యర్థులు నిరుత్సాహపడొద్దు. హామీ ఇచ్చినట్లు ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం’ అని ఎక్స్లో పోస్టు చేశారు.

ఏపీ మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల - Tholi Paluku