
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాలు ఈ నెల 30 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం జరిగిన బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేశారు.
బీఏసీ సమావేశం
స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ను రూపొందించారు. ఈ సమావేశాలు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. అయితే సెప్టెంబర్ 20, 21, 28 తేదీల్లో సెలవులు ప్రకటించారు. సభలో చర్చించాల్సిన అంశాలపై టీడీపీ 18, బీజేపీ 9 అంశాలను ప్రతిపాదించాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మంత్రులు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రశ్నోత్తరాల సమయంతో పాటు శూన్య గంటలో కూడా మంత్రులు తప్పనిసరిగా సభలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ పది రోజుల సమావేశాల్లో రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే అనేక అంశాలపై చర్చ జరగనుంది.
సెప్టెంబర్ 19 న జలవనరుల అంశం, సెప్టెంబర్ 22న శాంతి భద్రతలు, సెప్టెంబర్ 23 వైద్యారోగ్య రంగం, సెప్టెంబర్ 24న పరిశ్రమల అభివృద్ధి, సెప్టెంబర్ 25న సూపర్-6 పథకాలు, సెప్టెంబర్ 26న క్వాంటం వ్యాలీ, సెప్టెంబర్ 27న లాజిస్టిక్స్ రంగం, సెప్టెంబర్ 29 రోజు స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, సెప్టెంబర్ 30న రాయలసీమ-కోస్తా-ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశాలపై చర్చ జరుగనుంది.
ఈ సమావేశాలు ప్రభుత్వ విధానాలు, భవిష్యత్తు ప్రణాళికలపై ప్రజలకు పూర్తి స్పష్టతనిస్తాయని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ సమావేశాలు కీలక వేదికగా నిలవనున్నాయి.
