Let's talk: editor@tmv.in
ఏప్రిల్ 25న కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటన

ఏప్రిల్ 25న కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటన

Gaddamidi Naveen
28 మార్చి, 2026

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, ఏప్రిల్ 25న తన నూతన పార్టీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఏప్రిల్ 25న‌ ఉదయం 10 గంటలకు. హైదరాబాద్ శివార్లలోని మునీరాబాద్‌ వద్ద జరిగే భారీ బహిరంగ సభలో పార్టీ పేరు, జెండాను ఆవిష్కరిస్తారు. రాష్ట్ర సమస్యలపై ప్రధాన రాజకీయ పార్టీల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సామాన్య ప్రజల సమస్యలు సరైన ప్రాధాన్యం పొందడం లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ‘సర్వోదయ తెలంగాణ’ సాధించాలంటే కొత్త రాజకీయ శక్తి అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. పూర్తిగా తెలంగాణ సమస్యలపై కేంద్రీకృతమై ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె తెలిపారు.

జాతీయ స్థాయి నాయకులను ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నారా అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ఇది పక్కా తెలంగాణ ప్రాంతీయ పార్టీ అని స్పష్టం చేశారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే మా పార్టీ 95 శాతం దృష్టి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న విషయాలను చూసుకునేందుకు ప్రత్యేకంగా జాతీయ కమిటీ ఉంటుందని తెలిపారు. తన పార్టీ ఏ ఇతర పార్టీకి 'బీ టీమ్' కాదని, తెలంగాణలో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే పార్టీలో మహిళలకు, యువతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, పురుషులు స్థాపించిన పార్టీలను ఇన్నాళ్లూ చూసిన మహిళలు ఇప్పుడు తనను ఆదరించాలని ఆమె కోరారు.

బీఆర్ఎస్ ఎప్పుడైతే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిందో, అప్పుడే తెలంగాణపై దృష్టి తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ లేదు. అందుకే, ప్రతి ఇంటి పార్టీగా మా 'జాగృతి' నిలవబోతోందని కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు తనతోనే ఉన్నార‌ని, రైతు సంక్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం పోరాడతానని కవిత ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉంది.