Let's talk: editor@tmv.in
ఏప్రిల్ 11న పూలే విగ్రహాల ఆవిష్కరణ: పనులను పరిశీలించిన మంత్రులు

ఏప్రిల్ 11న పూలే విగ్రహాల ఆవిష్కరణ: పనులను పరిశీలించిన మంత్రులు

Gaddamidi Naveen
1 ఏప్రిల్, 2026

నగరంలోని ట్యాంక్ బండ్ ఐమాక్స్ థియేటర్ ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్క్ వద్ద ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాల నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏప్రిల్ 11వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదిగా ఈ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది.

విగ్రహాల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించిన అనంతరం, మంత్రులు ఉన్నతాధికారులు, ముఖ్య నేతలతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆవిష్కరణకు రెండు రోజుల ముందే విగ్రహ ఏర్పాటు పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున, సభా ప్రాంగణంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా భద్రత, ట్రాఫిక్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య పాల్గొన్నారు. బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు విగ్రహ ఏర్పాటు పనుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. నగర నడిబొడ్డున పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేయడం సామాజిక న్యాయానికి నిదర్శనమని మంత్రులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.