
ఏప్రిల్ 10 నుంచి టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులకు ముగింపు
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులను ఏప్రిల్ 10 నుంచి నిలిపివేస్తున్నట్లు కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రకటన ప్రకారం, టోల్ వసూలు కోసం ప్రధానంగా ‘ఫాస్టాగ్’వ్యవస్థనే ఉపయోగించాల్సి ఉంటుంది. వాహనంలో చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ లేకుండా టోల్ ప్లాజాకు వచ్చినవారు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపు చేయవచ్చు. అయితే ఈ విధంగా చెల్లిస్తే సంబంధిత వాహనానికి వర్తించే టోల్ రుసుముపై 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో టోల్ గేట్ల వద్ద ఏర్పడే పొడవైన వాహనాల వరుసలు తగ్గి, జాతీయ రహదారులపై ప్రయాణం మరింత సులభంగా మారుతుందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారి తెలిపారు.
నిరాకరిస్తే చర్యలే
నోటిఫికేషన్ ప్రకారం, ఫాస్టాగ్ లేకుండా టోల్ ప్లాజాకు వచ్చిన వాహనదారులు యూపీఐ ద్వారా చెల్లించాలనుకుంటే , ఆ వాహనానికి వర్తించే టోల్ రుసుము కంటే 1.25 రెట్లు చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవర్ లేదా వాహన యజమాని ఈ విధంగా చెల్లించేందుకు నిరాకరిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఇటీవల ఎన్‌హెచ్‌ఏఐ ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను 50 లక్షలకు పైగా వినియోగదారులు తీసుకున్నారు. ఈ పాస్ ద్వారా ఏడాదికి రూ.3,000 చెల్లించి గరిష్ఠంగా 200 టోల్ క్రాసింగ్‌లు చేయవచ్చు. ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 26.55 కోట్ల లావాదేవీలు జరిగాయి. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రస్తుతం 1,150కి పైగా టోల్ ప్లాజాలు పనిచేస్తున్నాయి.
