Let's talk: editor@tmv.in
ఏప్రిల్ నుంచి చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ:మంత్రి కందుల దుర్గేష్

ఏప్రిల్ నుంచి చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ:మంత్రి కందుల దుర్గేష్

Panthagani Anusha
4 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చలన చిత్ర పరిశ్రమను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇందుకోసం ఏప్రిల్‌ నెల నుంచి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సినిమా రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, యువ ప్రతిభకు అవకాశాలు, అవార్డులు–ఉత్సవాల పునరుద్ధరణ వంటి అంశాలతో కార్యాచరణ రూపుదిద్దుకుంటుందని ఆయన తెలిపారు.

మంగళవారం వెలగపూడి సచివాలయంలోని రెండో బ్లాక్‌లో గల తన ఛాంబర్‌లో ‘మా–ఏపీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో విజయం సాధించిన దర్శకులు, నటీనటులను మంత్రి కందుల దుర్గేష్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు జ్ఞాపికలు అందజేశారు. సామాజిక స్పృహతో కూడిన షార్ట్ ఫిలిమ్స్ రూపొందించిన యువ దర్శకులు, సాంకేతిక నిపుణులు, కళాకారులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ఏపీ చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా జనవరి 11న తెనాలిలో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ‘మా–ఏపీ’ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా కృషిని మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో చర్చించి త్వరలోనే నంది అవార్డులు, నంది నాటకోత్సవాల నిర్వహణపై అధికారిక ప్రకటన చేస్తామని తెలిపారు.

అంతేకాక హైదరాబాద్‌కు ధీటుగా అమరావతిని సినిమా రంగానికి కేంద్ర బిందువుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. సినిమా రంగ అభివృద్ధికి అవసరమైన ఫిల్మ్ పాలసీ, స్టూడియో, శిక్షణ కేంద్రాలు, ఫిల్మ్ ఫెస్టివల్స్ వంటి అంశాలపై ఏప్రిల్ నుంచి ప్రత్యేక కార్యాచరణ ప్రారంభమవుతుందని తెలిపారు. యువ దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.

కాగా ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రాష్ట్రవ్యాప్తంగా 203 షార్ట్ ఫిల్మ్ ఎంట్రీలు రాగా దాదాపు 2 వేల మంది నటీనటులు పాల్గొన్నారు. విశాఖపట్నానికి చెందిన చంద్రశేఖర్ శకునాల తెరకెక్కించిన ‘మహావృక్షం’ ప్రథమ బహుమతి సాధించగా శ్రీకాకుళానికి చెందిన శ్రీనివాసరావు రూపొందించిన ‘సింహాద్రి అప్పన్న’ ద్వితీయ బహుమతి, పాలకొల్లుకు చెందిన నవీన్ కుమార్ తీసిన ‘అబద్దం వర్సెస్ నిజం’ తృతీయ బహుమతి గెలుచుకున్నాయి. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు లక్ష రూపాయల నగదు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే ఏపీ యువత సినిమా రంగంలో అద్భుతాలు సృష్టించగలరని అన్నారు. ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ యువ కళాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, మరింత ప్రోత్సాహం అందితే ఎవరెస్ట్‌నైనా ఎక్కగలమనే ఆత్మవిశ్వాసం వారిలో పెరిగిందని పేర్కొన్నారు.

ఏప్రిల్ నుంచి చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ:మంత్రి కందుల దుర్గేష్ - Tholi Paluku