Let's talk: editor@tmv.in
ఏప్రిల్‌‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ: మంత్రి పొంగులేటి

ఏప్రిల్‌‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ: మంత్రి పొంగులేటి

Gaddamidi Naveen
8 జనవరి, 2026

అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ దిశగా రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తూ, రానున్న రెండు సంవత్సరాలలో రెండు విడతలుగా అర్హులైన లబ్ధిదారులందరికీ ఇండ్లు అందించేందుకు కార్యాచరణ రూపొందించిందని. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.

సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ పనులను మార్చి 31లోగా పూర్తిచేయాలని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న 2160 ఇందిరమ్మ ఇళ్ల కాలనీ పనుల పురోగతిని రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తదితర అధికారులు కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను, సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను పరిశీలించి, అనంతరం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

హుజూర్‌నగర్‌లో నిర్మిస్తున్న 2160 ఇందిరమ్మ హౌసింగ్ కాలనీని మోడల్ కాలనీగా అభివృద్ధి చేయాలని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలన్నింటిని సమగ్రంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మిగిలిపోయిన పనులను తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించి, పూర్తి చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.

ఈ కాలనీ పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన పనుల కోసం అవసరమైన అంచనాలను రూపొందించి పంపితే ఈ నెల 15లోగా అనుమతులు మంజూరు చేస్తామని, అవసరమైతే పనులను విభజించి వేగంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

రాజకీయాలకతీతంగా, కులం, మతం, వర్గం అనే భేదం లేకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు వెచ్చిస్తూ, ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రతి సోమవారం దశలవారీగా బిల్లులు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరిన నేపథ్యంలో, అలాగే గతంలో గృహజ్యోతి పథకం కింద మంజూరు చేసిన ఇండ్లను పూర్తి చేయాలన్న ఇతర పార్టీ ఎమ్మెల్యేల విజ్ఞప్తులపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పేదల గృహ నిర్మాణంపై నిర్లక్ష్యం వహించిందని మంత్రి విమర్శించారు.

గృహ నిర్మాణ పాలసీ ప్రకారం బహు పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించి, మార్చి 31లోపు వారికి ఇళ్లు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను గుర్తించి తుది జాబితా రూపొందించాలని మంత్రి పేర్కొన్నారు.

ఏప్రిల్‌‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ: మంత్రి పొంగులేటి - Tholi Paluku