
ఏప్రిల్‌లో నింగిలోకి ‘ఆర్టెమిస్-2’
అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ సిద్ధమైంది. సుమారు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాబిల్లి చెంతకు మానవుడిని పంపే ‘ఆర్టెమిస్-2’ మిషన్‌ను ఏప్రిల్‌లో చేపట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 1న ఈ చారిత్రక ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేయగా, ఏవైనా కారణాల వల్ల ఆ రోజు సాధ్యపడకపోతే ఏప్రిల్ 2ను ప్రత్యామ్నాయ తేదీగా కేటాయించింది. ఈ భారీ రాకెట్‌ను మార్చి 19న ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలో ఉన్న లాంచ్ ప్యాడ్ 39బికి తరలించనున్నారు.
నలుగురు వ్యోమగాములు.. 10 రోజుల ప్రయాణం
ఈ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు చందమామ చుట్టూ ప్రయాణించి తిరిగి భూమికి చేరుకుంటారు. నాసా వ్యోమగాములు రీడ్ వైజ్‌మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్‌లతో పాటు కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ ఈ బృందంలో ఉన్నారు. ఓరియన్ నౌకలో వీరు 10 రోజుల పాటు అంతరిక్షంలో గడుపుతారు. చంద్రుడి ఉపరితలంపై మానవుడు దిగడానికి ముందు, వ్యోమగాములతో కూడిన వ్యోమనౌక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో పరీక్షించడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. గతంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నా, రాకెట్ పైభాగంలో హీలియం సరఫరాలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వాయిదా పడింది.
అంగారకుడిపై అడుగుకు ఇదే పునాది
ఆర్టెమిస్ కార్యక్రమం కేవలం చంద్రునికే పరిమితం కాదని, భవిష్యత్తులో అంగారక గ్రహం (మార్స్) మీదికి చేపట్టబోయే మానవ సహిత యాత్రలకు ఇది తొలిమెట్టు అని నాసా తెలిపింది. చంద్రుడిపై శాశ్వత మానవ నివాసాలను ఏర్పాటు చేయడం, అక్కడి వనరులను ఉపయోగించుకోవడంపై ఈ మిషన్ దృష్టి సారిస్తుంది. "ఇది ఒక పరీక్షా ప్రయోగం, ఇందులో రిస్క్ ఉంటుంది.. కానీ మా బృందం, పరికరాలు సిద్ధంగా ఉన్నాయి" అని నాసా ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ విభాగం అధికారి లోరీ గ్లేజ్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో 1972లో అపోలో-17 మిషన్ ద్వారా చివరిసారిగా మనిషి చంద్రుడిపై అడుగుపెట్టారు.
అంతర్జాతీయ పోటీ
అంతరిక్ష రంగంలో ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాల మధ్య పోటీ నెలకొంది. అమెరికా నాయకత్వంలోని ‘ఆర్టెమిస్ ఒప్పందం’లో భారత్ సహా 40 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. మరోవైపు చైనా, రష్యా దేశాలు కలిసి 2030 నాటికి చంద్రుడిపై పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇదే సమయంలో భారత్ కూడా ‘గగన్‌యాన్’ ద్వారా సొంతంగా అంతరిక్షంలోకి మానవుడిని పంపేందుకు సిద్ధమవుతోంది. 2027-28 నాటికి గగన్‌యాన్ మానవ సహిత యాత్ర చేపట్టే అవకాశం ఉంది.
