Let's talk: editor@tmv.in
ఏప్రిల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ: రంగంలోకి దిగిన తెలంగాణ సీఈవో

ఏప్రిల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ: రంగంలోకి దిగిన తెలంగాణ సీఈవో

Gaddamidi Naveen
22 ఫిబ్రవరి, 2026

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక స‌వ‌ర‌ణ‌కు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ నెల నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక ముమ్మర సవరణ (స‌ర్) కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి. సుదర్శన్ రెడ్డి సన్నాహక పనులను ముమ్మరం చేశారు.

ఓటర్ల జాబితా రూపకల్పనలో కీలక పాత్ర పోషించే క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చే ప్రక్రియను సీఈవో కార్యాలయం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని సీఈవో కార్యాలయం నుంచి ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఈ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 195 మంది ఏఈఆర్ఓలు ఈ శిక్షణలో పాల్గొని ఓటర్ల జాబితా రూపకల్పన, నవీకరణ మరియు నిర్వహణపై అవగాహన పెంచుకున్నారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రతి ఓటరిని జాబితాలో చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడం, వివరాల్లోని లోపాలను సరిదిద్దడం వంటి బాధ్యతలపై అధికారులకు స్పష్టమైన మార్గనిర్దేశం ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయతను కాపాడడంలో అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు పాత్ర కీలకమని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా క్రమబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు.

రాబోయే స‌ర్ కార్యక్రమానికి సంబంధించిన అన్ని సిద్ధతలను సమయపాలనతో, వ్యవస్థబద్ధంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఓటరు జాబితాల పవిత్రతను కాపాడటం ఎన్నికల వ్యవస్థ బలోపేతానికి ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల ప్రక్రియను నిర్ధారించడానికి ఎన్నికల యంత్రాంగాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.

ఏప్రిల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ: రంగంలోకి దిగిన తెలంగాణ సీఈవో - Tholi Paluku