
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ లీసా గిల్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్-హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు స్వీకరించి తోటి న్యాయమూర్తులతో కలిసి విధుల్లో చేరారు.
తొలి మహిళా సీజేగా బాధ్యతలు చేపట్టే అవకాశం
కాగా ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన రిటైర్మెంట్ అనంతరం సీనియారిటీ ప్రాతిపదికన జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టుకు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ పరిణామం రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.
చండీగఢ్‌కు చెందిన జస్టిస్ లీసా గిల్ పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం పట్టాలను పొందారు. 1990లో పంజాబ్-హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆమె, 2014 మార్చి 31న అదే హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుమారు పదేళ్లకు పైగా న్యాయమూర్తిగా విశేష సేవలు అందించిన ఆమె ఇప్పుడు బదిలీపై ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు.
ఈకార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు,అడిషినల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అడ్వకేట్స్ అసోసియేషన్ వైస్ ప్రసిడెంట్ కేవీ రఘు కుమార్, బార్ కౌన్సిల్ ఛైర్మన్ ద్వారకానాథ్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ నారాయణ, సీనియర్ న్యాయవాదులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
